Vinesh Phogat About PT Usha :భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తాజాగా భారత ఒలింపిక్ సంఘంతో పాటు అధ్యక్షురాలు పీటీ ఉషపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వారందరూ తనకు మద్దతు తెలిపే విషయం తీవ్ర జాప్యం చేయడం వల్లనే కాస్‌లో తీర్పు అనుకూలంగా రాలేదంటూ ఆరోపించారు. పీటీ ఉష కేవలం ఫొటోలు తీసుకుని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడానికే వచ్చారంటూ వినేశ్ అన్నారు.
"నేను ఇక్కడ ఉన్నాను. మీరు నా దగ్గరకు వచ్చారు. కానీ నాతో ఏం చెప్పకుండానే ఫొటోలు దిగారు. ఆ తర్వాత వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. పైగా దానికి 'మేమంతా నీతోనే ఉన్నాం' అని క్యాప్షన్ పెట్టారనుకోండి. అప్పుడు మీరందరూ నాకు సపోర్ట్‌గా ఉన్నట్లా? లేకుంటే ఆ రోజు పీటీ ఉష మేడమ్ నా దగ్గరకు వచ్చి ఫొటోలు దిగారు. నా ఆరోగ్యం గురించి కనీసం ఏమీ అడగలేదు. వాటిని ఆన్‌లైన్‌లో పోస్టు చేశారు. ఇదంతా షో కోసమే. అదో పెద్ద రాజకీయం. కాస్(CAS)లో కేసును నా పేరు మీదనే ఫైల్ చేశాను. సాధారణంగా అయితే అది దేశం పేరుతో చేయాల్సింది. కానీ, ప్రభుత్వం, ఐవోఏ నుంచి నాకు ఏమాత్రం సపోర్ట్ రాలేదు. అసలు వారు ఆ మెడల్‌ను ఎప్పుడో వదిలేసేశారు. హారీశ్ సాల్వే కేసును వాదించేందుకు వచ్చారు. మేమంతా దేశం కోసం ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో ప్రభుత్వం నుంచి మాకు పెద్దఎత్తున మద్దతు దక్కాల్సింది. కానీ, వారంతా మీడియాకు బైట్లు ఇచ్చే పనిలో బిజీగా ఉండిపోయారు. దీంతో థర్డ్ పార్టీగానే కాస్‌లో మేం వాదనలను వినిపించాం. ఇక భారత రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడిగా ఇప్పుడున్న సంజయ్ సింగ్ నుంచి కూడా మేం సానుకూల ఫలితాలు ఆశించలేం. బ్రిజ్ భూషణ్‌కు బదులు డమ్మీ ఆయన క్యాండేట్‌గా ఉన్నారు. ఆయన్ను మేం అస్సలు విశ్వసించలేం. ఇప్పటికీ బ్రిజ్‌భూషణ్ ఇంటి నుంచే డబ్ల్యూఎఫ్‌ఐ (WFI) నడుస్తోంది. మీకు ఏదైనా అనుమానం ఉంటే వెళ్లి చెక్ చేసుకోవచ్చు" అంటూ వినేశ్ వ్యాఖ్యానించారు.