U19 World Cup 2024 Uday Saharan : అండర్-19 ప్రపంచ కప్‌లో యంగ్ టీమ్ఇండియా అద్భుత ప్రదర్శన చేసింది. మంగళవారం సౌతాఫ్రికాతో బెనోని వేదికగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదోసారి అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరుకుంది. స్వల్ప వ్యవధిలోనే కీలకమైన నాలుగు వికెట్లను కోల్పోయిన టీమ్ ఇండియాను సచిన్ దాస్‌తో కలిసి కెప్టెన్ ఉదయ్ సహరన్ గెలిపించాడు. దీంతో సహరన్ 'ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును దక్కించుకున్నాడు. అయితే అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరుకోవడంపై సహరన్ ఆనందం వ్యక్తం చేశారు.
చివరి వరకూ క్రీజులో ఉండాలి :మైదానంలోకి అడుగు పెట్టినప్పుడు చివరి వరకూ క్రీజులో ఉండాలని ముందే నిర్ణయించుకున్నట్లు ఉదయ్ సహరన్ చెప్పాడు. " నా ఆటతీరుపై నాకు నమ్మకముంది. ఒక మంచి భాగస్వామ్యం ఉంటే చాలు గెలవడం పెద్ద కష్టం కాదని నేను నమ్ముతాను. మ్యాచ్‌ను చివరి వరకూ తీసుకెళ్లాలని మనసులోనే అనుకుంటూ ఉన్నాను. కేవలం నేను ఆరు ఫోర్లు మాత్రమే కొట్టాను. అందులో నాకు ఎలాంటి బాధ లేదు. ఇలా ఆడటం మా నాన్న నుంచి నేర్చుకున్నా. అవసరమైతే చివర్లో భారీ షాట్లు కొట్టాలని భావించాను. నేను క్రీజులో ఉండటమే చాలా ముఖ్యమని తెలుసు" అని ఉదయ్ సహరన్ అంటున్నారు.
" నేను బ్యాటింగ్‌కు వచ్చే సమయానికి బంతి ఎక్కువగా బౌన్స్ అవుతోంది.పేసర్లకు అనకూలంగా ఉంది. అందుకే తొలుత సరిగా బ్యాటింగ్ చేయలేకపోయాను. కొంచెం సేపు తర్వాత బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. అప్పటికీ బంతి బౌన్స్ అవుతూనే ఉంది. అయితే అప్పటికే మేం క్రీజులో కుదురుకోవటం వల్ల పెద్ద కష్టంగా అనిపించలేదు. సచిన్ దాస్‌కు ఒకటే చెప్పాను. చివరి వరకూ క్రీజులో ఉండేందుకు ప్రయత్నించు. నేను ఉంటా. అప్పుడే మ్యాచ్ గెలవడం తేలికవుతుందని అన్నాను. అలా జరగకపోతే పరుగులు చేయటం చాలా కష్టమవుతుంది. బౌండరీ లైన్ ఆవతల నుంచి మా కోచింగ్ సిబ్బంది మమ్మల్ని ప్రోత్సహించారు. నా కెప్టెన్సీలో సెమీస్‌లో విజయం సాధించి ఫైనల్‌కు చేరడం ఆనందంగా ఉంది. అక్కడ కూడా మంచి ఆటతీరుతో ఛాంపియన్‌గా నిలుస్తామని భావిస్తున్నా. అలానే ఈ సెమీస్ మ్యాచ్ మాకు తుది పోరుకు మంచి ప్రాక్టీస్ చేసినట్లుగా ఉంది" - ఉదయ్ సహరన్, అండర్-19 టీమ్ఇండియా కెప్టెన్