Top Cricketers Never Played IPL:ప్రపంచంలోని రిచెస్ట్ స్పోర్ట్స్ లీగ్స్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఒకటి. 2008లో ప్రారంభమైన ఐపీఎల్ వేగంగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం 2024లో 17వ సీజన్ జరగబోతోంది. ఇప్పటి వరకు ఈ లీగ్‌లో చాలా మంది స్టార్ ప్లేయర్‌లు పాల్గొన్నారు. భారత్ మాత్రమే కాదు విదేశాలకు చెందిన లెజండరీ క్రికెటర్లు చాలా మంది ఐపీఎల్ ఆడారు. వాస్తవానికి ఐపీఎల్ ఛాన్స్ కోసం చాలా మంది క్రికెటర్లు ఎదురుచూస్తుంటారు. కేవలం రెండు నెలల క్రికెట్‌తో ఈ స్థాయి సంపాదన మరెక్కడా లభించదు. అయితే ఇప్పటికీ కొంత మంది స్టార్ క్రికెటర్లు ఐపీఎల్ ఆడలేదంటే నమ్ముతారా? ఆశ్చర్యంగా ఉందా? ఇంటర్నేషనల్ క్రికెట్‌లో గొప్ప పేరుండి.. ఇప్పటికీ ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆడని ఆటగాళ్ల వివరాలివే..
- జేమ్స్ అండర్సన్:అండర్సన్ ఆల్ టైమ్ స్వింగ్ బౌలర్లలో ఒకడు. టెస్ట్ క్రికెట్‌లో 700 వికెట్లు తీసిన మొట్ట మొదటి పేసర్. ఫిట్‌నెస్‌కు మారుపేరైన అండర్సన్ ఇప్పటికీ 40 ఏళ్ల వయస్సులోనూ బౌలింగ్‌లో అదరగొడుతున్నాడు. ఇటీవల భారత్- ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కూడా ఆడాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో స్టార్‌గా పేరున్న అండర్సన్ ఇప్పటివరకూ ఐపీఎల్లో మాత్రం ఆడలేదు.
- బ్రియాన్ లారా:'ప్రిన్స్ ఆఫ్ ట్రినిడాడ్' బ్రియాన్ లారా ఆల్ టైమ్ అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు. లారా తన కెరీర్‌లో 400కి పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు (టెస్టులు, వన్డేలు) ఆడాడు. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ ఫ్రాంచైజీకి హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. కానీ, లారా ఏ సీజన్లోనూ ప్లేయర్‌గా ఐపీఎల్లో మ్యాచ్ ఆడలేదు.
- స్టువర్ట్ బ్రాడ్:ఇంగ్లాండ్ టాప్‌క్లాస్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్. టెస్టు క్రికెట్‌లో సుదీర్ఘకాలం రాణించాడు. ఇంగ్లాండ్ టీ20 టీమ్‌కి కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. 56 టీ20లు ఆడిన బ్రాడ్, 4/24 అత్యుత్తమ గణాంకాలతో, మొత్తం 65 వికెట్లు పడగొట్టాడు. అయితే బ్రాడ్ 2011లో పంజాబ్ కింగ్స్ (అప్పటి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్) ఫ్రాంచైజీలో భాగంగా ఉన్నా, ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
- ముష్ఫికర్ రహీమ్:బంగ్లాదేశ్‌కి చెందిన అత్యుత్తమ క్రికెటర్లలో ముష్ఫికర్ రహీమ్ ఒకడు. రహీమ్ హిట్టర్, బెస్ట్ వికెట్ కీపర్. కానీ టీ20 ఫార్మాట్ అతనికి పెద్దగా కలిసి రాలేదు. 102 ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్‌లు ఆడిన రహీమ్, 19.23 యావరేజ్‌తో 1500 పరుగులు చేశాడు. ఐపీఎల్ వేలంలో ఉన్నా, రహీమ్‌ను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయలేదు. దీంతో రహీమ్‌కు ఐపీఎల్లో బరిలోకి దిగే ఛాన్స్ రాలేదు.
- తమీమ్ ఇక్బాల్:బంగ్లాదేశ్ డాషింగ్ లెఫ్ట్ హ్యాండర్, ఓపెనర్ తమీమ్ ఇక్బాల్‌కి ప్రపంచ క్రికెట్‌లో మంచి గుర్తింపు ఉంది. టెస్టు మ్యాచ్‌లో లార్డ్స్‌లో సెంచరీ సాధించిన తొలి బంగ్లాదేశ్ ఆటగాడిగా రికార్డు సాధించాడు. అంతే కాకుండా 78 ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 24.08 యావరేజ్‌తో 1758 పరుగులు చేశాడు. ఇందులో 7 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ కూడా ఉన్నాయి. ఇక గతంలో పుణె వారియర్స్ ఇండియా (ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ లేదు) కొనుగోలు చేసినా, మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు.