Police Constable Commits Suicide in Hyderabad : హైదరాబాద్‌లో ఒక పోలీసు కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నగరంలోని మలక్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మలక్‌పేట పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
జనావత్ కిరణ్ (36) ఫిలిమ్ నగర్ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. ఇతను 2014 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్. హైదరాబాద్‌లోని ఆస్మాన్‌ఘడ్ బస్తీలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే.. నాలుగు రోజుల కిందట హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటూ సెలవు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఏం జరిగిందో తెలియదుగానీ.. డిసెంబర్ 31వ తేదీన రాత్రి దంపతుల మధ్య వివాదం తలెత్తిందని పోలీసులు తెలిపారు.
ఈ గొడవ చినికి చినికి గాలివానలా మారడంతో.. వీరి పంచాయితీ పోలీసు స్టేషన్‌కు చేరింది. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. కిరణ్ మలక్‌పేట పోలీసు స్టేషన్లో తన భార్యపై ఫిర్యాదు చేశాడు. అతని భార్య కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. బుధవారం రాత్రి వేళ ఇంటికి చేరుకున్న కిరణ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లోని ఒక గదిలోకి వెళ్లి, గడియ పెట్టుకున్నాడు.
కాసేపటి తర్వాత కుటుంబ సభ్యులు పిలిస్తే స్పందించలేదు. చాలా సేపు పిలిచినా కిరణ్ మాట్లాడకపోవడంతో.. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పక్కింటి వాళ్లను, ఇరుగుపొరుగు వాళ్లను పిలిచి తలుపులు పగలగొట్టి, గది లోనికి వెళ్లారు. సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని, వేళాడుతున్న కిరణ్ వారికి కనిపించాడు.
తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు.. ఫ్యాన్‌కు వేళాడుతున్న కానిస్టేబుల్ కిరణ్‌ను కిందకు దించి.. పోలీసులకు సమాచారమిచ్చారు. ఆ వెంటనే మలక్‌పేటలోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ కిరణ్‌ను పరీక్షించిన వైద్యులు.. అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆ తర్వాత పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు మలక్‌పేట్ పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, ఎస్సై మృతి - అసలేం జరిగింది?
భూమి, కులాంతర వివాహం కోసమే చంపేశారు - కానిస్టేబుల్ హత్య కేసులో తమ్ముడి అరెస్ట్