T20 World Cup Super 8 :టీ20 వరల్డ్‌కప్ - 2024లో గ్రూపు స్టేజీలో బాగానే రాణించిన టీమ్ఇండియా ఇక సూపర్ - 8 పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో గ్రూప్ - ఏలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. నాలుగో మ్యాచ్ రద్దైంది. దీంతో సూపర్-8లో తోఆఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్, ఆస్ట్రేలియాతో టీమ్ఇండియా పోటీ పడనుంది. ఈ నేపథ్యంలో గతంలో సూపర్-8లో టీమ్ఇండియా రికార్డ్ ఎలా ఉందో పరిశీలిద్దాం.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) టీ20 ప్రపంచకప్‌లో ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ వచ్చింది. సూపర్ 8, సూపర్ 10, సూపర్ 12 ఫార్మాట్లలో మ్యాచ్‌లను నిర్వహిస్తూ వచ్చింది. అయితే ఈ సారి పొట్టి ప్రపంచకప్‌ను సూపర్ 8 రౌండ్లో నిర్వహిస్తోంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత సూపర్-8 ఫార్మాట్‌ను తిరిగి నిర్వహిస్తున్నారు. చివరిగా 2012 టీ20 ప్రపంచకప్‌ను సూపర్ 8 ఫార్మాట్లో నిర్వహించారు. అయితే ఈ సూపర్-8 ఫార్మాట్లో టీమ్ ఇండియా ట్రాక్ రికార్డు చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. చాలా పేలవంగానే ఉంది.
ఇప్పటి టీ20 ప్రపంచ కప్ టోర్నీలో సూపర్ 8లో 12 మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు కేవలం నాలుగింటిలో మాత్రమే విజయం సాధించింది. ఎనిమిది మ్యాచుల్లో ఓటమిని అందుకుంది. విజయ శాతం 33.3 ఉండగా ఓటమి శాతం 66.67గా ఉంది.
2007 టీ20 వరల్డ్‌కప్‌లో టీమ్ఇండియా మూడు మ్యాచ్‌లు ఆడి రెండింట విజయం సాధించింది. ఒక్క మ్యాచ్‌లో ఓటమిని అందుకుంది. 2009, 2010 వరల్డ్ కప్ సూపర్-8లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ పరాజయాన్ని అందుకుంది. 2012 ప్రపంచ కప్‌లో రెండింటిలో గెలుపొంది, ఒక్క మ్యాచ్‌లో ఓడింది. ఈ నాలుగు ప్రపంచకప్‌లలోనూ ధోనీ నాయకత్వంలోనే భారత్ బరిలోకి దిగింది. 2007 ప్రపంచకప్‌ను మహీ సారథ్యంలోనే టీమ్ఇండియా అందుకుంది. ఇప్పుడు మళ్లీ 2012 తర్వాత అంటే 12 ఏళ్లు అనంతరం తొలి సారి సూపర్-8 ఫార్మాట్లో ఆడతోంది.