Teamindia Road Show :టీ20 ప్రపంచకప్ 2024 సాధించి విశ్వవేదికపై భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన టీమ్ ఇండియాను ఘనంగా సన్మానించింది బీసీసీఐ. ముందుగా చెప్పినట్టే రూ.125 కోట్ల నగదు బహుమతిని చెక్ రూపంలో అందజేసింది. అంతకుముందు ముంబయి నగరంలో భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించింది.
నారీమన్ పాయింట్ నుంచి వాంఖడె స్టేడియం వరకు ఈ పరేడ్ ఉత్సాహబరితంగా సాగింది. లక్షలాదిగా అభిమానులు తరలివచ్చారు. అలా అభిమానుల సందడితో ఆ ప్రాంతం జనసంద్రాన్ని తలపించింది. టీమ్ఇండియా ఆటగాళ్లు కూడా ఫ్యాన్స్ మధ్యలోని నుంచి వరల్డ్ కప్ ట్రోఫీని పట్టుకుని అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఓపెన్ టాప్ బస్సులోంచి రోహిత్ శర్మ, కోహ్లీ, ఇతర ప్లేయర్స్ అభిమానులకు అభివాదం చేస్తూ ఫుల్ జోష్ నింపారు. ఈ వేడుకల్లో BCCI సెక్రటరీ జై షా, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా కూడా పాల్గొన్నారు.
హార్దిక్, సూర్యపై ప్రశంసలు - భారత కెప్టెన్ రోహిత్ శర్మ T20 ప్రపంచ కప్ 2024 ఫైనల్లోని కొన్ని అద్భుతమైన క్షణాలను గుర్తుచేసుకున్నాడు. సూర్య కుమార్ యాదవ్ పట్టిన అద్భుతమైన బౌండరీ క్యాచ్‌తో పాటు 20వ ఓవర్‌ను అద్భుతంగా బౌలింగ్ చేసినందుకు హార్దిక్‌ను ప్రశంసించాడు.
రోహిత్ ఫోన్ కాల్ - భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ జట్టు నైపుణ్యాలపై ప్రశంసలు కురిపించాడు. 2023 వన్డే ప్రపంచ కప్ తర్వాత భారత జట్టుకు కోచ్‌గా కొనసాగాలని భారత కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ఫోన్ కాల్‌ను గుర్తుచేసుకున్నాడు. అభిమానుల ప్రేమను తాను కోల్పోబోతున్నానని అన్నాడు.
రోహిత్‌ను ఇలా తొలిసారి చూశాను - "15 ఏళ్లలో రోహిత్ ఇంతలా ఎమోషన్ అవ్వడం నేను చూడటం ఇదే తొలిసారి. ఆ రాత్రి (2011 ప్రపంచకప్ విజయం తర్వాత) ఏడ్చిన సీనియర్ల ఎమోషన్లతో నేను కనెక్ట్ కాలేకపోయాను. కానీ ఇప్పుడు అయ్యాను " అని రోహిత్ గురించి కోహ్లీ మాట్లాడాడు.