Kedar Jadhav Retirement:టీమ్ఇండియా సీనియర్ ప్లేయర్ కేదార్ జాదవ్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 39ఏళ్ల జాదవ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం ప్రకటించాడు. తన నిర్ణయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. 'నా 1500 గంటల కెరీర్లో మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. ఇక నేను అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి నేను తప్పుకున్నట్లు పరిగణించండి' అని రాసుకొచ్చాడు. కాగా, జాదవ్ 2014లో శ్రీలంకతో జరిగిన సిరీస్‌తో టీమ్ఇండియా తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో 73 వన్డేలు, 9 టీ20ల్లో టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక 2020లో ఆఖరి వన్డే మ్యాచ్ ఆడాడు.
ఇక దాదాపు ఆరేళ్లు టీమ్ఇండియాకు జాదవ్ ఆల్‌రౌండర్‌గా సేవలందించాడు. వన్డేల్లో 42.09 సగటుతో 1389 పరుగులు సాధించాడు. అందులో రెండు సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పలు మ్యాచ్‌ల్లో జాదవ్ బంతితోనూ రాణించాడు. వన్డేల్లో 42 ఇన్నింగ్స్‌లో 27 వికెట్లు పడగొట్టాడు. స్పిన్ బౌలరైన జాదవ్ అవసరమైనప్పుడు టీమ్ఇండియాకు బ్రేక్ ఇచ్చాడు. అయితే ఫామ్‌లేమి కారణంగా జట్టులో చోటు కోల్పోయిన జాదవ్, క్రమంగా దూరమవుతూ వచ్చాడు.
2019 వరల్డ్‌కప్‌లోనూ
2019 వన్డే వరల్డ్‌కప్‌నకు అప్పట్లో జాదవ్ ఎంపికయ్యాడు. పలు మ్యాచ్‌ల్లో తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఆ టోర్నమెంట్లో జాదవ్ పెద్దగా ఆకట్టుకోలేదు. మొత్తంగా 5 ఇన్నింగ్స్‌లు ఆడిన జాదవ్ కేవలం 80 పరుగులే చేయగలిగాడు. దీంతో అప్పట్లో అతడి ఎంపికపై విమర్శలు వచ్చాయి.