Rohit Sharma Rahul Dravid:టీమ్ఇండియా క్రికెటర్లు గురు పౌర్ణమి సందర్భంగా తమ గురు సమానులను గుర్తు చేసుకున్నారు. టీమ్ఇండియా సారధి రోహిత్ శర్మ, విధ్వంసకర ఆటగాడు రిషభ్ పంత్ తమ కెరీర్‌లో మార్గదర్శకులుగా నిలిచిన రాహుల్ ద్రవిడ్, ఎమ్ఎస్ ధోనీని కొనియాడారు. తమ కెరీర్ ఎదుగుదలలో రాహుల్ భాయ్ పాత్ర ఉందని రోహిత్ గుర్తు చేసుకున్నాడు. గురు పూర్ణిమ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ షేర్ చేసిన వీడియోలో రోహిత్, రిషభ్ పంత్ వారిపై పొగడ్తల వర్షం కురిపించారు.
ద్రవిడ్‌పై రోహిత్ ప్రశంసల జల్లు
టీమ్ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన సారధి రోహిత్ శర్మ, ద్రవిడ్‌పై తన గురు భక్తిని చాటుకున్నాడు. రాహుల్ ద్రవిడ్ ప్రపంచ కప్ గెలిచిన జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. వన్డే వరల్డ్ కప్‌లోనూ టీమ్ఇండియాను రన్నరప్‌గా నిలిపాడు. భారత జట్టు టీ 20 వరల్డ్ కప్ గెలవడంలో హెడ్ కోచ్‌గా ద్రవిడ్ కీలక పాత్ర పోషించాడు. క్రికెట్ ఆడే రోజుల్లో ద్రవిడ్ దృఢ సంకల్పాన్ని ప్రశంసించిన రోహిత్, రాహుల్ మార్గదర్శకత్వం తన క్రికెట్ కెరీర్ ఎదగడానికి చాలా సహాయపడిందని చెప్పాడు.
ఐర్లాండ్‌లో తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌కు ద్రవిడ్ కెప్టెన్‌గా ఉన్నాడని గుర్తు చేసుకున్న రోహిత్, ద్రవిడ్‌తో తన బంధం చాలా ఏళ్లుగా కొనసాగుతోందని ఆ వీడియోలో పేర్కొన్నాడు. ద్రవిడ్ తమందరికీ రోల్ మోడల్ అని వ్యక్తిగతంగా, జట్టుగా తాము ఏం సాధించామో కోట్లాది మంది క్రికెట్ అభిమానులు చూశారని రోహిత్ అన్నాడు. కఠినమైన పరిస్థితుల నుంచి తమను ద్రవిడ్ బయటకు తీసుకొచ్చాడని అన్నాడు. ద్రవిడ్ కెరీర్ మొత్తంలో అతని సంకల్పం, దృఢ చిత్తం నుంచి నేర్చుకుంటూనే ఉన్నానని వెల్లడించాడు. ప్రపంచకప్‌తో పాటు, అనేక ప్రధాన టోర్నమెంట్‌లను రాహుల్ ద్రవిడ్ మార్గదర్శకత్వంలో గెలుచుకున్నామని రోహిత్ గుర్తు చేసుకున్నాడు.