T20 WorldCup 2024 USA Team Performance :టీ20 ప్రపంచ కప్‌నకు ముందు వరకు అమెరికా జట్టుపై ఎలాంటి అంచనాలు లేవు. ఇక మొదలయ్యాక కెనడాపై అద్భుత విజయం సాధిస్తే ప్రత్యర్థి టీమ్ పసికూనేగా అంటూ కామెంట్లు చేశారు. కానీ ఇప్పుడు ఏకంగా వరల్డ్ కప్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన పాకిస్థాన్‌పై సూపర్ విక్టరీ సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తమతో పోరాటం అంత ఈజీ కాదంటూ మిగతా టీమ్‌లకు హెచ్చరికలు జారీ చేసింది.
అలా వెలుగులోకి - టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే అమెరికా బంగ్లాదేశ్‌తో మూడు టీ20ల సిరీస్ ఆడింది. అయితే ఈ సిరీస్‌లో యూఎస్‌ఏ గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ అనూహ్యంగా బంగ్లాను చిత్తుగా 2-1 తేడాతో ఓడించి సిరీస్‌ను దక్కించుకుంది. అలా యూఎస్‌ఏ పేరు వెలుగులోకి వచ్చింది. కెప్టెన్ మోనాంక్ పటేల్ వ్యక్తిగత ప్రదర్శనతో పాటు సహచరుల ఆటను వెలికి తీసి విజయం సాధించాడు. స్టీవెన్ టేలర్, ఆరోన్ జోన్స్ సహా తదితరులు బంగ్లాదేశ్‌పై మంచి ప్రదర్శన చేశారు. ఇప్పుడు ప్రపంచకప్‌లోనూ కీలక ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకుంటున్నారు. బౌలింగ్‌లో సౌరభ్ నేత్రావాల్కర్, జస్‌దీప్, నోస్తుష్ మెరుగైన ప్రదర్శన చేసి ప్రత్యర్థులకు అడ్డుకట్ట వేస్తున్నారు.
ఆసీస్ మాజీ ప్లేయర్ కోచింగ్‌తో -క్రికెట్‌లో అమెరికా ఇలా మెరుగవ్వడానికి కారణం ఆ జట్టు ప్లేయర్ల శ్రమ ఎంతుందో కోచ్‌గా వ్యవహరిస్తున్న ఆసీస్ మాజీ ప్లేయర్ స్టువర్ట్ లా పాత్ర కూడా అంతే. ఏప్రిల్‌లోనే యూఎస్‌ఏ ప్రధాన కోచ్‌గా లా బాధ్యతలు తీసుకుని జట్టులో జోష్ నింపాడు. గతంలో బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, లంక టీమ్‌లకు తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఎక్స్పీరియన్స్ కూడా అతడికి ఉంది.