T20 Worldcup 2024 Semifinal :దెబ్బకు దెబ్బ.2022 టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో తమ జట్టును మట్టికరిపించిన ఇంగ్లాండ్ టీమ్‌పై ప్రతీకారం తీర్చుకుంది టీమ్ఇండియా. అప్పుడు సెమీ పోరులో ఇంగ్లాండ్‌కు 169 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా కేవలం 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి టీమ్ఇండియాకు ఘోర పరాజయాన్ని మిగిల్చింది ప్రత్యర్థి జట్టు.
Teamindia Final : కానీ ఇప్పుడు మళ్లీ అదే పొట్టి ప్రపంచకప్ సెమీస్‌లో టీమ్ఇండియాపై చిత్తుగా ఓడింది. ఈ సారి లక్ష్యం 172. అయితే టీమ్ఇండియా బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేశారు. దీంతో ఇంగ్లాండ్ పప్పులుడకలేదు. బట్లర్ సేనను కేవలం 103 పరుగులకే కుప్పకూల్చేసి ఫైనల్‌కు దూసుకెళ్లారు మనోళ్లు. ఇక టైటిల్ పోరు కోసం శనివారం(జూన్ 29) దక్షిణాఫ్రికాతో తలపడనున్నారు.
మ్యాచ్ సాగిందిలా - అసలు వర్షం వల్ల ఆలస్యంగా మొదలైందీ మ్యాచ్. అనంతరం మధ్యలోనూ అంతరాయం కలిగించింది. కానీ ఈ పోరులో టీమ్ఇండియా స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసి 68 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టును చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఫామ్‌ను కొనసాగించిన రోహిత్ శర్మ(39 బంతుల్లో 6×4, 2×6 సాయంతో 57 పరుగులు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 4×4, 2×6 సాయంతో 47 పరుగులు) కూడా మంచి ప్రదర్శన చేశాడు. హార్దిక్ పాండ్య (13 బంతుల్లో 2 సిక్స్‌లు, 1 ఫోర్ సాయంతో 23), జడేజా (9 బంతుల్లో 2 ఫోర్లు సాయంతో 17*) పరుగులు చేశారు. విరాట్ కోహ్లీ (9), రిషబ్ పంత్ (4) నిరాశపరిచారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ (3/37), అడిల్ రషీద్ (1/25), రీస్ టాప్లీ (1/25) వికెట్లు తీశారు.