T20 Worldcup 2024 South Africa vs Bangladesh :టీ20 వరల్డ్ కప్ 2024లో బౌలర్ల జోరు కొనసాగుతోంది. చిన్న స్కోర్లను కూడా కాపాడుకుని జట్లు విజయాన్ని అందుకుంటున్నాయి. దాయాది పాక్ జట్టుపై టీమ్ఇండియా 119 పరుగులను కాపాడుకుంటే, బంగ్లాపై సౌతాఫ్రికా 113 పరుగులే చేసి గట్టెక్కేసింది. అయితే గొప్ప బౌలింగ్ ప్రదర్శనతో సఫారీ జట్టును కట్టడి చేసిన బంగ్లా, విజయానికి చేరువగా వెళ్లి చివర్లో తడబడి ఓటమిని అందుకుంది.
టీ20ల్లో సౌతాఫ్రికాపై మొదటిసారి విజయం సాధించే సువర్ణావకాశాన్ని బంగ్లాదేశ్ మిస్ చేసుకుంది. 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక ఆఖర్లో చతికిలపడింది. ఫలితంగా 4 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా గెలిచి ఊపిరిపీల్చుకుంది. ఈ విజయంతో గ్రూప్ డీలో దక్షిణాఫ్రికా ప్రస్తుతం మూడు విజయాలు, ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. సూపర్-8లోనూ దాదాపుగా చోటు ఖాయం చేసుకునేందుకు సిద్ధంగా ఉంది.
సోమవారం జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణతీ 20 ఓవర్లలో 6 వికెట్లకు 113 పరుగులే చేసింది. బంగ్లా బౌలర్లు తంజిమ్ హసన్ (3/18), తస్కిన్ అహ్మద్ (2/19) విజృంభించారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ క్లాసెన్ (46; 44 బంతుల్లో 2×4, 3×6), మిల్లర్ (29; 38 బంతుల్లో 1×4, 1×6), డికాక్ (18) రాణించారు.