T20 World Cup Teamindia Squad :టీ20 వరల్డ్ కప్ 2024కు సమయం దగ్గరపడుతోంది. ఐపీఎల్ 2024 ముగిసిన తర్వాత ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. జూన్ 1వ తేదీ నుంచి వెస్టిండీస్, అమెరికా వేదికగా ఈ పొట్టి ప్రపంచకప్ జరగనుంది. అయితే ఈ వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసే జట్టు విషయమై టీమ్ ఇండియా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జట్టు ఎవరు ఆడనున్నారనే విషయమై ఓ వార్త బయటకు వచ్చింది. రోహిత్ శర్మతో కలిసి కోహ్లీ ఓపెనింగ్ చేసే అవకాశముందని తెలిసింది. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్‌కు చోటు దక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు.
వివరాల్లోకి వెళితే - అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జట్టు ఎంపిక కోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తోందని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రతీ ఆటడాడిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ నిర్ణయాలను తీసుకుంటోందట. అయితే టీ20 ప్రపంచకప్‌నకు జట్టును ఎంపిక చేసేందుకు మే 1 చివరి తేదీ కావడంతో జట్టు ఎంపికపై సెలక్షన్ కమిటీ చర్చల ప్రక్రియను ఇప్పుడు వేగవంతం చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఇప్పటికే సమావేశం అయ్యారట. టీ 20 ప్రపంచకప్ జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉంటాడని ఇప్పటికే ఓ స్పష్టత వచ్చిన వేళ ఇప్పుడు మరో వార్త వైరల్‌గా మారుతోంది.
అదేంటంటే? - ఓపెనర్లుగా రోహిత్, విరాట్ కోహ్లీని బరిలోకి దింపితే ఎలా ఉంటుందన్న దానిపై సెలక్షన్ కమిటీ చర్చలు జరుపుతోందని తెలుస్తోంది. టీ20ల్లో ఓపెనింగ్ చేస్తున్న శుభ్‌మన్ గిల్‌ను బ్యాకప్ ఓపెనర్‌గా ఆడించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయంపై అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే ఐపీఎల్‌లో ఓపెనర్లుగా బరిలోకి దిగుతున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పరుగుల వరద పారిస్తున్నారు. ఈ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఓపెనర్‌గా దిగుతున్న కోహ్లీ ఇప్పటికే ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలతో సహా 361 పరుగులు చేసి అద్భుతంగా రాణిస్తున్నాడు. ఓపెనర్‌గా కేవలం తొమ్మిది మ్యాచ్‌లు అడిన కోహ్లీ 57 సగటుతో 400 పరుగులు సాధించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగినప్పుడు కోహ్లీ స్ట్రైక్ రేట్ కూడా 138కి పైనే ఉంది. ఈ అంశాలను సెలక్షన్ కమిటీ పరిశీలిస్తోందట. మరోవైపు ఓపెనర్‌గా రోహిత్ శర్మ సృష్టించిన విధ్వంసం, నెలకొల్పిన రికార్డులు అందరికీ తెలుసు. వీటన్నింటీని పరిశీలనలోకి తీసుకున్న సెలక్షన్ కమిటీ వీరిద్దరిని ఓపెనర్లుగా బరిలోకి దింపాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.