T20 World Cup 2024 Preview : 2007 ఆరంభ టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన తర్వాత టీమ్ఇండియా మరోసారి ఈ కప్‌ను ముద్దాడలేకపోయింది. 2014లో ఫైనల్లో ఓటమిని చవిచూసింది. చివరగా 2022లో సెమీస్‌లోనే ఇంటిబాటపట్టింది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మరో ఐసీసీ టోర్నీలో నెగ్గని భారత్, ఇప్పుడు ఈ గెలుపుతో కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఆశిస్తోంది. నంబర్‌వన్ టీ20 జట్టుగా బరిలో దిగనున్న రోహిత్ సేనపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. జట్టుకు కూడా ఈ కప్ గెలిచే సత్తా ఉంది. టైటిట్ ఫేవరెట్లలో ఒకటైన భారత్ సీనియర్లు, జూనియర్లతో సమతూకంగా కనిపిస్తోంది.
రెండో టైటిల్‌పై కన్ను
2009లో టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడిన పాక్ జట్టు రానున్న టైటిల్ చేజిక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. 2022లో ఆఖరి వరకు వచ్చి ఓటమిపాలైన ఆ జట్టు, ఈ ఈ సారి కప్‌ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. నిరుడు వన్డే ప్రపంచకప్‌లో పాక్ ఘోర వైఫల్యం వల్ల కెప్టెన్‌గా వేటు ఎదుర్కొన్న బాబర్ అజామ్ మళ్లీ జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టాడు.
ఇదిలా ఉండగా, 2011 వన్డే ప్రపంచకప్‌లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన కోచ్ కిర్‌స్టెన్, ఇప్పుడు పాక్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. తన శిక్షణలో జట్టు మంచి ఫామ్ కనబరుస్తుందని ఆశిస్తున్నారు. ఇక పేస్ బౌలింగ్‌లో పాక్ దుర్భేద్యంగా కనిపిస్తోంది. నసీం షా, షహీన్ షా అఫ్రిది, హారిస్ రవూఫ్, సీనియర్ మహమ్మద్ అమీర్, అబ్బాస్ అఫ్రిది కూడా జట్టులో కీలకం కానున్నారు.
అయితే రిటైర్మెంట్ నుంచి వెనక్కివచ్చిన అమీర్ పాక్‌కు కీలకమయ్యే అవకాశముంది. అబ్రార్ అహ్మద్ షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం, లాంటి టాప్ స్పిన్నర్లు ఆ జట్టుకు బలాన్ని చేకూర్చనున్నారు. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో 54 మ్యాచ్‌లాడిన స్పిన్నర్ ఇమాద్‌కు అక్కడి పరిస్థితులు కొట్టిన పిండే. బ్యాటింగ్‌లోనే భారమంతా బాబర్, రిజ్వాన్‌పైనే పడుతోంది. వీళ్లకు తోడు ఫకర్ జమాన్, పవర్ హిట్టర్లు ఇఫ్తికార్ అహ్మద్, అజాం ఖాన్, సయీం ఆయూబ్ రాణించాలని పాక్ ఆశిస్తోంది. అయితే ఆ జట్టుకు నిలకడలేమి, అస్థిరత పెద్ద సమస్య. ఇటీవల ఐర్లాండ్ చేతిలో టీ20 మ్యాచ్‌లో ఓడింది. గ్రూప్ దశ దాటే అవకాశమున్న పాక్ ఆ తర్వాత ఎక్కడివరకూ వెళ్తుందో చూడాలి.
డెబ్యూలోనే దడ పుట్టించాలని
టీ20 ప్రపంచకప్‌లోకి డెబ్యూ ఇవ్వనున్న అమెరికా, కెనడాపై ఈ టోర్నీలో పెద్దగా అంచనాల్లేవు. అయితే డెబ్యూతోనే తమేంటో నిరూపించుకోవాలని రెండు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. భారత సంతతి ఆటగాళ్లతో ఆ జట్టు బలంగా మారగా, కెప్టెన్ మోనాంక్ పటేల్ బ్యాటింగ్‌లో రాణిస్తూ, నాయకత్వ నైపుణ్యాలతోనూ ఆకట్టుకుంటున్నాడు.