Suryakumar Yadav Comeback:360 డిగ్రీల ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ గాయం నుంచి కోలుకుని రీసెంట్గా ముంబయి జట్టుతో కలిశాడు. ఇక దిల్లీతో మ్యాచ్‌లో బరిలోకి దిగి డకౌటయ్యాడు. దీంతో సూర్య ఇప్పట్లో ఫామ్‌లోకి రాడేమో అని అభిమానులు, ముంబయి ఫ్యాన్స్ భయపడ్డారు. కానీ, ఎలాంటి దిగులు చెందవద్దని నేనున్నానంటూ రెండో మ్యాచ్‌లోనే మళ్లీ పాత ఫామ్ అందుకున్నాడు. ఏకంగా గురువారం ఆర్సీబీపై విధ్వంసం సృష్టించాడు.
కొన్ని నెలల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన సూర్య ఆర్సీబీపై ఇన్నింగ్స్‌తో ఔరా అనిపించాడు. 19 బంతుల్లోనే 52 పరుగుల చేసి ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన సూర్య 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. సూర్య దెబ్బకు ఆర్సీబీ బౌలర్లకు ముచ్చెమటలు పట్టాయి. ఈ క్రమంలో సూర్యపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. 'టీ20ల్లో ఇలాంటి ఇన్నింగ్స్ అంటే గతంలో డివిలియర్స్ గుర్తొచ్చేవాడు. కానీ, ఇప్పుడు ఆ స్థానాన్ని సూర్య భర్తీ చేస్తున్నాడు. డివిలియర్స్ కంటే సూర్యనే డేంజరస్ ప్లేయర్ అనిపిస్తున్నాడు' అని మాజీ క్రికెటర్ హర్భజన్ సైతం సూర్యను ప్రశంసించాడు.
మరోవైపు, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 2024 ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు. వాంఖడే స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఐపీఎల్‌లో ఫైఫర్ (5 వికెట్లు) తీయడం బుమ్రాకిది రెండోసారి. ఈ క్రమంలో బెంగళూరుపై ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా కూడా అవతరించాడు. అలాగే ఆర్సీబీపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ నిలిచి పర్పుల్ క్యాప్ సైతం దక్కించుకున్నాడు.