తెలంగాణ

telangana

ETV Bharat / sports

42 పరుగులకే ఆలౌట్- అత్యల్ప స్కోర్ ఇదే- శ్రీలంక చెత్త రికార్డు! - SRI LANKA VS SOUTH AFRICA TEST 2024

42 పరుగులకే కుప్పకూలిన లంక- ఐదుగురు బ్యాటర్లు డకౌట్!

South Africa vs Sri Lanka
South Africa vs Sri Lanka (Source : Associated Press)

By ETV Bharat Sports Team

Published : Nov 28, 2024, 6:37 PM IST

Sri Lanka vs South Africa Test 2024: శ్రీలంక క్రికెట్ జట్టు చెత్త రికార్డు మూట గట్టుకుంది. సౌతాఫ్రికాతో డర్భన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో 42 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్​లో బ్యాటింగ్​కు దిగిన శ్రీలంక 13.5 ఓవర్లలోనే ఆలౌటైంది. సఫారీల బౌలింగ్ దెబ్బకు లంక బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. జట్టులో ఏకంగా ఐదుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. కామిందు మెండీస్ (13 పరుగులు) టాప్ స్కోరర్. మార్కో జాన్సన్ 7 వికెట్లతో లంక పతనాన్ని శాసించాడు. గెరాల్డ్ కాట్జీ 2, కగిసో రబాడ 1 వికెట్ దక్కించుకున్నారు. కాగా, టెస్టు క్రికెట్ చరిత్రలో శ్రీలంకకు ఇదే అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం.

టెస్టుల్లో శ్రీలంక అత్యల్ప స్కోర్లు

  • 42 vs సౌతాఫ్రికా- డర్బన్- 2024
  • 71 vs పాకిస్థాన్- క్యాండీ- 1994
  • 73 vs పాకిస్థాన్- క్యాండీ- 2006
  • 81 vs ఇంగ్లాండ్- కొలంబో - 2001
  • 82 vs భారత్- చండీగఢ్ - 1990
  • 82 vs ఇంగ్లాండ్- కార్డిఫ్- 2011

జాన్సన్ అదరహో
ఇటీవల మెగా వేలంలో మార్కొ జాన్సన్ రూ.7 కోట్లు దక్కించుకున్నాడు. జాన్సన్​ను పంజాబ్ కింగ్స్​ భారీ ధరకు దక్కించుకుంది. వేలం ఇచ్చిన ఉత్సాహమో ఏమో కానీ, జాన్సన్ ఈ మ్యాచ్​లో 120ఏళ్ల రికార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్​లో జాన్సన్ 6.5 ఓవర్లలో 13 పరుగులిచ్చి, 7 వికెట్లు నేలకూల్చాడు. అంటే 35 బంతుల్లోనే సఫారీ పేసర్ ఈ ఘనత సాధించాడు. దీంతో టెస్టుల్లో 120 ఏళ్ల రికార్డును జాన్సన్ సమం చేశాడు. 1904లో ఆస్ట్రేలియా బౌలర్ హ్యూజ్ ట్రంబల్ కూడా 35 బంతుల్లోనే 7 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో అత్యంత తక్కువ బంతుల్లో ఈ ఫీట్ సాధించిన బౌలర్​గా ట్రంబల్ కొనసాగుతున్నాడు. దాదాపు 120ఏళ్ల తర్వాత జాన్సన్ ఈ రికార్డును అందుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే, అంతకుముందు తొలి ఇన్నింగ్స్​లో సౌతాఫ్రికా 191 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్​లోనే ఆతిథ్య సఫారీ జట్టుకు 149 పరుగుల ఆధిక్యం లభించింది.

7 పరుగులకే ఆలౌట్​ - టీ20ల్లో అత్యల్ప స్కోర్ ఇదే!

తిప్పేసిన సుందర్- కివీస్ 259 ఆలౌట్

ABOUT THE AUTHOR

...view details