Sports Personalities Who Fought With Cancer : ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ఇప్పటికీ ఆ వ్యాధితో పోరాడేవారు ఎందరో ఉన్నారు. అయితే కొందరు మాత్రం దాన్ని అధిగమించి మళ్లీ మనముందుకొచ్చారు. అలాంటి వారిలో ఎంతో మంది క్రీడాకారులు ఉన్నారు. వారు మైదానంలోనే కాదు వ్యక్తిగత జీవితంలోనూ అనేక సవాల్‌ను ఎదుర్కొని క్యాన్సర్‌ను జయించారు. వారెవరు. వారి ఇన్స్పిరేషనల్ జర్నీ గురించి తెలుసుకుందామా?
లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్
1996లో ఆర్మ్‌స్ట్రాంగ్ క్యాన్సర్ బారినపడ్డారు. 25 ఏళ్ల వయసులో వృషణ క్యాన్సర్‌తో (Testicular cancer) బాధపడ్డారు. అది ఆయన ఊపిరితిత్తులు, కడుపు, మెదడుకు కూడా వ్యాపించింది. దీంతో శస్త్రచికిత్స తర్వాత కూడా ఆయన బతికే అవకాశాలు 40 శాతం కంటే తక్కువగా ఉన్నాయంటూ వైద్యులు చెప్పేశారు. కానీ ఆర్మ్‌స్ట్రాంగ్ మాత్రం ఏ మాత్రం కుంగిపోకుండా క్యాన్సర్‌ను జయించి 1999, 2005లో టూర్ డి ఫ్రాన్స్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించి చరిత్రలో గొప్ప సైక్లిస్ట్‌లలో ఒకరిగా చరిత్రకెక్కారు.
లియాండర్ పేస్
స్టార్ టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్‌కు 2003లో మెదడు ఎడమ భాగంలో సుమారు 4 మిల్లిమీటర్ల తిత్తి(cyst) ఉండగా, అది క్యాన్సర్ ఇన్‌ఫెక్షన్ అని తేలింది. అయినప్పటికీ పేస్ కోలుకుని మళ్లీ రాకెట్ చేతపట్టాడు. మార్టినా నవ్రతిలోవాతో కలిసి 2004 ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌కు చేరుకున్నాడు.
యువరాజ్ సింగ్
క్రికెట్ వన్డే ప్రపంచ కప్ 2011 తర్వాత యువరాజ్ సింగ్ సెమినోమా అనే ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడ్డాడు. అనంతరం చికిత్స తీసుకుని దాన్ని జయించాడు. ఆ తర్వాత 2017లో భారత్ తరఫున ఆడేందుకు తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇప్పుడు YouWeCan అనే ఫౌండేషన్‌ను స్థాపించి దాని ద్వారా క్యాన్సర్ రోగులకు చికిత్స అందిస్తున్నాడు.
ఎరిక్ అబిడాల్
2011లో ఫ్రాన్స్‌కు చెందిన ఈ ఫుట్‌బాలర్ తన క్యాన్సర్ కణతిని శస్త్రచికిత్స ద్వారా తొలగించుకున్నాడు. ఎన్నో సమస్యలను జయించి కేవలం రెండు నెలల తర్వాత, మాంచెస్టర్ యునైటెడ్‌తో జరిగిన ఛాంపియన్స్ లీగ్ ఫైనల్‌లో బార్సిలోనాకు ప్రాతినిధ్యం వహించాడు. అతడి సహచరులు అబిడాల్‌కు కెప్టెన్ ఆర్మ్‌బ్యాండ్ ఇవ్వడమే కాకుండా ఆ ట్రోఫీని ఎత్తే అవకాశాన్ని కూడా ఇచ్చారు.
సైమన్ ఓ'డొన్నెల్
1987లో ఆస్ట్రేలియా క్రికెట్ ప్రపంచ కప్ విజయం సాధించిన తర్వాత ఆల్ రౌండర్ సైమన్ ఓ'డొనెల్ క్యాన్సర్ బారినపడ్డాడు. అయితే దాన్ని జయించి డొన్నెల్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం చేశాడు. అంతేకాకుండా కేవలం 18 బంతుల్లోనే వన్డేల్లో అత్యంత వేగంగా 50 పరుగులు చేసి రికార్డుకెక్కాడు. 1993 వరకు ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు.