Late Night Eating Side Effects: మీరు రోజు రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లేనని పరిశోధకులు చెబుతున్నారు. కొందరు రాత్రి పూట ఆలస్యంగా.. కొవ్వులు, చక్కెరతో కూడిన ఆహారం ఎక్కువగా తింటుంటారు. ఇలా పడుకోవటానికి 3 గంటల్లోపు భోజనం చేసేవారిలో (వారానికి కనీసం నాలుగు రోజుల పాటు) పెద్దపేగు చివర (కొలోరెక్టల్) క్యాన్సర్ వచ్చే ముప్పు తగ్గుతున్నట్టు షికాగోలోని రష్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. రాత్రి భోజనాన్ని త్వరగా తినేవారితో పోలిస్తే ఆలస్యంగా తినేవారికి చిన్న కణితి (అడినోమా) ఏర్పడే అవకాశం 46% ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు కనిపెట్టారు. వీరిలో మూడు కన్నా ఎక్కువ కణితులు తలెత్తే ముప్పు 5.5 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వాస్తవానికి ఇలాంటి కణితులు క్యాన్సర్ రహితంగానే ఉంటాయని.. వీటిల్లో కొన్ని మాత్రమే క్యాన్సర్‌గా మారే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. జీర్ణకోశంలో ఇవి ఉన్నచోటు, సైజును బట్టి ఇది ఆధారపడి ఉంటుందని వివరించారు.
పెద్దపేగు క్యాన్సర్‌కూ ఆలస్యంగా భోజనం చేయటానికీ మధ్య సంబంధమేంటి?
జీర్ణకోశంలోని జీవగడియారం గతి తప్పటమే పెద్దపేగు క్యాన్సర్‌కు కారణమని పరిశోధకులు భావిస్తున్నారు. ఆలస్యంగా భోజనం చేసినప్పుడు మెదడు అది రాత్రి సమయమని.. పేగులేమో ఉదయమని భావిస్తాయని వివరించారు. ఇంకా ఆలస్యంగా భోజనం చేసేవారు చాలాసార్లు ఆరోగ్యకరమైన ఆహారం కాకుండా.. కొవ్వు, చక్కెర అధికంగా ఉన్న పదార్థాలు తీసుకుంటారు. ఫలితంగా ఇది పేగుల్లోని జీవగడియారాన్ని అస్తవ్యస్తం చేయటమే కాకుండా.. బరువు పెరిగి క్యాన్సర్ ముప్పును పెంచుతుందని చెబుతున్నారు.
పేగుల్లోని కొన్ని బ్యాక్టీరియాలకు కొన్ని జీవగడియారాలుంటాయని.. ఇవి రోజువారీ లయను అనుసరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. తినే ఆహారాన్ని బట్టి కొన్నిరకాల బ్యాక్టీరియా మరింత చురుకుగా వ్యవహరించొచ్చని అంటున్నారు. ముఖ్యంగా కొవ్వు, చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలను ఆలస్యంగా తిన్నప్పుడు వీటిపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు పేర్కొన్నారు. అయితే, చాలా అధ్యయనాలు ఎప్పుడు తింటున్నామనే విషయం కన్నా ఏం తింటున్నాయనే అంశంపైనే జరుగుతుంటాయి. కానీ, భోజన వేళలనూ పరిగణనలోకి తీసుకోవటం ఆరోగ్యానికి ముఖ్యమని తాజా అధ్యయనం చెబుతోంది.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
డైలీ బ్రేక్‌ఫాస్ట్ తినట్లేదా? అయితే, మీరు పెద్ద ప్రమాదంలో ఉన్నట్లే!