Sourav Ganguly Ind Vs Aus Final :1988లో ప్రారంభమైన అండర్ -19 వరల్డ్ కప్ ఇప్పుడు 15వ ఎడిషన్ ఫైనల్‌కు చేరుకుంది. సౌఫ్రికాలోని బెనోని వేదికగా ఆదివారం భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఇప్పటివరకు ఈ టోర్నీకి ఒక్కసారి కూడా మన భారత్ ఆతిథ్యం ఇవ్వలేదు. అయితే ఈ మ్యాచ్‌లు నిర్వహిస్తే లాభదాయకంగా ఉండదనే ఉద్దేశంతోనే బీసీసీఐ దీన్ని నిర్వహించేందుకు ఆసక్తి చూపించడం లేదన్న విమర్శలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వాటిపై టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ స్పందించాడు.
"అండర్-19 వరల్డ్ కప్‌ను ఇక్కడ నిర్వహించకపోవడానికి ప్రత్యేకంగా ఎటువంటి కారణాలు లేవు. ఇతర మెగా టోర్నీలు ఇక్కడ చాలానే జరిగాయి. నాలుగేళ్లకొకసారి వచ్చే సీనియర్ వరల్డ్ కప్‌ల కంటే, అండర్-19 కప్ జరగకపోతే నష్టమేంటో నాకు అసలు అర్థంకావడం లేదు. మనకి కాకపోతే వేరే దేశాలకు ఈ మ్యాచ్‌లను నిర్వహించే అవకాశం దక్కుతోంది. అప్పుడు క్రికెట్ విస్తరించేందుకు వీలుగా ఉంటుంది. చాలామంది ఈ టోర్నీని నిర్వహించడం వల్ల బీసీసీఐకి ఆదాయం రాదనే కోణంలో నెట్టింట కామెంట్ చేస్తున్నారు. అయితే సీనియర్ జట్లు పాల్గొనే వరల్డ్ కప్‌ల వల్ల కూడా కొన్నిసార్లు ఆ సంస్థకు ఆదాయం ఉండదు. అలాగని మనం నిర్వహించకుండా ఉంటున్నామా? లేదు కదా. అయితే, భవిష్యత్తులో తప్పకుండా అండర్ -19 ప్రపంచకప్ భారత్‌లో జరుగుతుందని నేను భావిస్తున్నాను" అని సౌరభ్ వ్యాఖ్యానించాడు.