Shreyas Iyer Ranji Trophy :టీమ్ఇండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. ముంబయి జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈ స్టార్ క్రికెటర్, ఒడిశాపై డబుల్ సెంచరీ బాదాడు. 228 బంతుల్లో 24 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 233 పరుగులు బాదాడు. స్ట్రైక్ రేట్ ఏకంగా 102.19 ఉండడం గమనార్హం. అంతకుముందే మహారాష్ట్రపై సెంచరీ బాదిన శ్రేయస్, ఒడిశాపైనా విరుచుకుపడ్డాడు. భారత టెస్ట్ జట్టులో చోటే లక్ష్యంగా శ్రేయస్ చెలరేగుతున్నాడు.
దూకుడుగా బ్యాటింగ్
ముంబయి- ఒడిశా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అయ్యర్ మొదటి నుంచి దూకుడుగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. బౌండరీలతో చెలరేగిన శ్రేయస్ రంజీల్లో తన రెండో డబుల్ సెంచరీని పూర్తి చేశాడు. ఈ క్రమంలో ముంబయి జట్టు 4 వికెట్ల నష్టానికి 602 పరుగుల చేసి ఇన్సింగ్స్‌కు డిక్లేర్ చేసింది.
గాయం, ఫామ్ లేమి కారణంగా జట్టుకు దూరం
కాగా, టెస్టు ఫార్మాట్లో ప్రస్తుతం టీమ్ఇండియా మిడిలార్డర్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సమయంలో అయ్యర్ భారీ ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకుంటున్నాడు. దీంతో అతడిని టెస్టు జట్టులోకి తీసుకోవాలనే ప్రతిపాదనలు మొదలయ్యాయి. కాగా, శ్రేయస్ అయ్యర్ తన పేలవ ఫామ్ కారణంగా భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయాడు. అయ్యర్ చివరగా ఇండియా తరపున టెస్టుల్లో ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్‌పై ఆడాడు. తొలి టెస్టు ఆడిన అయ్యర్ వెన్ను గాయం తిరగబెట్టడం వల్ల సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.