Shikhar Dhawan Jersey:పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ సోషల్ మీడియా వేదికగా మరో సారి ఎమోషనల్ అయ్యాడు. ఐపీఎల్‌లో పంజాబ్ ఫ్రాంచైజీకి ఆడుతున్న ధావన్ జెర్సీని కొడుకు పేరుతో రెడీ చేయించాడు. నెం.1 వేయించి ZORAVER పేరున్న ఆ జెర్సీని ధరించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. దాని కింద ఎమోషనల్‌గా నువ్వెప్పుడూ నాతోనే ఉంటావ్ (You're Always with Me, My Boy) అంటూ కామెంట్ కూడా పెట్టాడు. ఇక ఈ జెర్సీతోనే ధావన్ నెక్ట్స్ మ్యాచ్ల్లో బరిలోకి దిగాలంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. దీంతో జొరావర్ పేరుతో ఉన్న జెర్సీతోనే గబ్బర్ బరిలోకి దిగినా ఆశ్చర్యం లేదని ఇంకొందరు అంటున్నారు.
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ధావన్, భార్యతో విడిపోయిన తర్వాత నుంచి కొడుకుతో దిగిన ఫొటోలను మాత్రమే షేర్ చేసుకుంటున్నాడు. పైగా అవన్నీ కొడుకుతో తాను చెప్పాలనుకున్న మాటలే అన్నట్లుగా ధావన్ పోస్టులు ఉంటున్నాయి. ఆయేషాతో విడిపోయిన తర్వాత కొడుకే సర్వంగా గడిపేస్తున్న ధావన్ గతంలోనూ ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు.
'మనం నేరుగా కలిసి ఏడాది కావొస్తుంది. గత మూడు నెలలుగా నీతో మాట్లాడనివ్వకుండా నన్ను అన్ని రకాలుగా అడ్డుకుంటున్నారు. నీతో నేరుగా మాట్లాడకపోయినప్పటికీ, టెలిపతితో ఎప్పుటికీ నీ మనసుకు దగ్గరగానే ఉంటాను. నువ్వు ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నాను. నిన్ను చూసి గర్విస్తున్నాను' అని ధావన్ గతంలో పోస్టు పెట్టాడు.
'నాన్న నిన్ను మిస్ అవుతున్నా. ఆ దేవుని దయతో మనం కలిసే రోజు కోసం నువ్వు చిరునవ్వుతో ఎదురుచూస్తావని నాకు తెలుసు. అప్పటి వరకూ బలంగా, ధైర్యంగా, సహనంగా, హుందాగా ఉండు. కొంటెగా ఉండు కానీ, అల్లరి చేయకు. నిన్ను రోజూ కలవకపోయినా నీకు మెసేజ్‌లు పంపుతున్నా. నీ గురించి తెలుసుకుంటున్నా. లవ్ యూ జోరా నాన్న' అని అందులో చాలా భావోద్వేగానికి గురయ్యాడు.