Sanju Samson India Vs Bangladesh 3rd T20 : టీమ్ఇండియా బ్యాటర్ సంజు శాంసన్ చాలా ప్రతిభ ఉన్న క్రికెటర్‌గా పేరుగాంచాడు. కెరీర్ తొలినాళ్ల నుంచి నుంచి అతడిపై ఇదే ముద్ర ఉంది. అందుకే సంజుని జట్టులోకి తీసుకోకపోవడంతో అభిమానులు ఉద్యమమే చేసేవారు. చాలా ఆలస్యంగానైనా భారత జట్టులోకి వచ్చిన శాంసన్, దొరికిన అవకాశాలను పెద్దగా సద్వినియోగం చేసుకోలేదు. ఒకటి రెండు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినా అతడి స్థాయి ఆటను ఇప్పటిదాకా చూపించలేదు. దీంతో జట్టులో సంజుకు స్థానమే ప్రశ్నార్థకమైంది.
సంజు విలయ తాండవం
తాజాగా బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో వచ్చిన అవకాశాన్ని సంజు వినియోగించుకున్నాడు. కుర్రాళ్లు దూసుకొస్తున్న సమయంలో, ఒత్తిడిని జయించి సంజు బ్యాట్ శివాలెత్తింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా విలయ తాండవం చేసింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో మూడో టీ20లో సంజు పరుగుల సునామీ సృష్టించి, తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు.
10 ఏళ్లలో 32 మ్యాచులే
2015లో జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో సంజు శాంసన్ భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు. దాదాపు ఈ పదేళ్లలో సంజు ఆడిన మ్యాచ్‌లు కేవలం 32 మాత్రమే. అందులో కేవలం రెండు అర్ధసెంచరీలే ఉన్నాయి. సగటు మరీ దారుణంగా 20లోపే ఉంది. దీంతో అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోడన్న ముద్ర సంజుపై పడిపోయింది. అభిమానులు ఎంతగా మద్దతు ఇచ్చినా, ఒత్తిడి సమయాల్లో సంజు తేలిపోయేవాడు. కానీ కెరీరే ప్రమాదంలో పడిన స్థితిలో అతడు అద్భుతమైన ఇన్నింగ్స్ తో (47 బంతుల్లో 111) మళ్లీ తన విలువని చాటి చెప్పాడు. మూడో టీ20లో బంగ్లా బౌలింగ్‌ను కకావికలం చేస్తూ విధ్వంసం సృష్టించాడు.
ఒకే ఓవర్లలో 5సిక్సర్లు
నిజానికి ఐపీఎల్‌లో సంజుని మొదటి నుంచి ఫాలో అయిన వాళ్లకు ప్రస్తుతం బంగ్లాపై అతడి ప్రదర్శన పెద్దగా ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. ఎందుకంటే ఐపీఎల్‌లో ఇలాంటి మెరుపు ఇన్నింగ్స్‌లు ఎన్నో ఆడాడు సంజు. కానీ తొలిసారి అంతర్జాతీయ స్థాయిలో అదరగొట్టాడు. టీ20ల్లో మొదటి సెంచరీ సాధించాడు. రోహిత్‌శర్మ తర్వాత వేగవంతమైన (40 బంతుల్లో) శతకం చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో లెగ్ స్పిన్నర్ రిషాద్ హుస్సేన్ బౌలింగ్‌లో వరుసగా అయిదు సిక్స్‌లు బాది ఔరా అనిపించాడు.
కుర్రాళ్ల నుంచి గట్టి పోటీ
సంజు శాంసన్ ప్రదర్శన చూస్తే అంతంత మాత్రం, మరోవైపు కుర్రాళ్ల నుంచి గట్టి పోటీ! ఈ స్థితిలో చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో బంగ్లాదేశ్ సిరీస్ వచ్చింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో 10, 29 పరుగులే చేశాడు శాంసన్. ఆఖరి టీ20లో అదిరే శతకంతో విమర్శకులకు బదులిచ్చాడు. తనలో వాడి తగ్గలేదని, టాప్ ఆర్డర్‌లో అదరగొట్టే సత్తా ఉందని నిరూపించుకున్నాడు. సంజు సత్తా చాటడం వల్ల ఇప్పుడు సెలక్టర్లకు సవాల్ గా మారింది. గత కొన్ని సిరీస్‌లలో జట్టులో ఉన్నా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయిన అతడు ఈసారి అవకాశాన్ని అందిపుచ్చుకుని రాబోయే సిరీస్‌లలోనూ తనను తీసుకోవాల్సిన పరిస్థితిని కల్పించాడు.