Ruturaj Gaikawad Srilanka Tour :శ్రీలంక టూర్లో భాగంగా తాజాగా టీమ్ఇండియా స్క్వాడ్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. టీ20లు, వన్డేలకు ఇలా వివిధ ఫార్మాట్లకుగానూ సెలక్టర్లు ప్లేయర్లను ఎంపిక చేశారు. అయితే జట్టు కూర్పు పట్ల పలువురు క్రీడాభిమానులు, మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అద్భుతంగా రాణిస్తున్న రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్లను పక్కనబెట్టడం సరైనది కాదంటూ కామెంట్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో చెన్నై సూపర్‌కింగ్స్ మాజీ బ్యాటర్ ఎస్. బద్రీనాథ్ తాజాగా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. రుతురాజ్ మెరుగ్గా రాణిస్తున్నప్పటికీ అతడికి జట్టులో స్థానం దక్కకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన అతడు, ఈ నిర్ణయం విషయంలో సెలక్షన్ కమిటీపై మండిపడ్డాడడు. వాళ్లు ఇలా చేయడం తనను షాక్‌కు గురి చేసిందని పేర్కొన్నాడు.
"టాలెంటెడ్ క్రికెటర్లు జట్టుకు ఎంపిక కానప్పుడు వాళ్లు బ్యాడ్‌బాయ్ ఇమేజ్‌తో ఉండటం చాలా అవసరమనిపిస్తోంది. జట్టుకు నిరంతరం ఎంపిక కావాలంటే ఒకటి బాలీవుడ్ హీరోయిన్లతో రిలేషిన్‌షిప్‌లో ఉండాలి, లేకుంటే ఒళ్లంతా టాటూలు వేయించుకోవాలేమో. ఇది కాకుండా మంచి మీడియా మేనేజర్‌ను కలిగి ఉండాలేమో" అంటూ సెలక్టర్లను ఉద్దేశించి బద్రీనాథ్ వ్యంగ్యంగా మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అతడు తన సోషల్‌మీడియాలో పంచుకున్నాడు.