Rubina Francis Paralympics 2024 : ఓ వైపు దిగువ మధ్యతరగతి కుటుంబ కష్టాలు, మరోవైపు కాలికి బలహీనత! ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఓ అమ్మాయి క్రీడల్లో రాణించడం ఆటలను కెరీర్‌గా చేసుకోవడం అంత తేలికైన పని కాదు. అటువంటిది ఖరీదైన షూటింగ్‌లోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా అంతర్జాతీయ పతకాలను సాధించే స్థాయికి వెళ్లి తన సత్తా చాటుకుంది రుబీనా ఫ్రాన్సిస్.
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్ వాసి రుబీనా తన కలను నెరవేర్చుకునేందుకు చాలా ఇబ్బందులు పడింది. బలహీనత కారణంగా పాదం మెలికబడటం వల్ల సరిగా నిలబడలేని పరిస్థితి ఆమెది. దీంతో పాటు ఆర్థిక ఇబ్బందులు తనను ముందుకు కదలనీయలేదు. వైకల్యాన్ని జయించేందుకు దృఢ నిశ్చయంతో ఉన్న ఆమెకు నాన్న సైమన్ ఫ్రాన్సిస్ అండ, మాజీ ఒలింపియ న్ గగన్ నారంగ్ స్ఫూర్తి గుండెల నిండా ఆత్మవిశ్వాసం నింపింది.
అలా షూటింగ్‌లో తన కెరీర్‌ను 2015లో ప్రారంభించింది. ఆ తర్వాత 2017లో నారంగ్ అకాడమీ 'గన్ ఫర్ గ్లోరీ'లో చేరడం ఆమె కెరీర్‌ను ఓ మలుపు తిప్పింది. మొదట్లో కూర్చొని షూటింగ్ చేసే విధానంలో శిక్షణ తీసుకున్నప్పటికీ అందులో ఆమె పరిపూర్ణత సాధించలేకపోయింది. దీంతో కోచ్ జైప్రకాశ్ ఆమెకు నిలబడేందుకు ఆదరువుగా ఓ ప్రత్యేకమైన బూట్లు తయారు చేయించి శిక్షణ ఇచ్చాడు. దీంతో ఆమె మెరుగైన ట్రైనింగ్‌లో స్థిరంగా రాణిస్తుండడం వల్ల మధ్యప్రదేశ్ షూటింగ్ అకాడమీ నుంచి రుబీనాకు పిలుపొచ్చింది. అక్కడ ప్రముఖ కోచ్ జస్పాల్ రాణా శిక్షణ వల్ల ఆమె మరింత మెరుగైంది.
పారాలింపిక్స్ లక్ష్యంగా : ఫ్రాన్స్ వేదికగా 2018లో జరిగిన ప్రపంచకప్‌లో పాల్గొనటం రుబీనాలోని కాన్ఫిడెన్స్ పెంచింది. అప్పుడే ఆమెకు పారాలింపిక్లో పతకం సాధించిన సాధించాలన్న లక్ష్యం ఏర్పడింది. అలా 2021లో లిమా వేదికగా జరి గిన ప్రపంచకప్‌లో స్వర్ణం గెలిచే క్రమంలో 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ పీ2 విభాగంలో పారాలింపిక్ బెర్తు సాధించింది.