Rohit Sharma Mother:టీ20 వరల్డ్‌కప్ ఛాంపియన్స్ 'విక్టరీ పరేడ్'లో అపురూప సంఘటన జరిగింది. టీమ్ఇండియా సన్మాన కార్యక్రమాన్ని చూసేందుకు వాంఖడే స్టేడియానికి వచ్చిన తన తల్లిదండ్రులను కెప్టెన్ రోహిత్ శర్మ ర్యాలీ అనంతరం కలిశాడు. టీమ్ఇండియాను ప్రపంచ విజేతగా నిలిపిన తన కుమారుడు రోహిత్‌ను చూడగానే తల్లి పూర్ణిమ భావోగ్వేగానికి లోనయ్యారు.
రోహిత్‌ను దగ్గరగా తీసుకొని అతడిని ముద్దాడారు. అయితే గురువారం ఆమె డాక్టర్ వద్దకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ తన కుమారుడిని చూసేందుకు వాంఖడేకు వచ్చినట్లు పూర్ణిమ చెప్పారు. కాగా, అక్కడున్న వారందరినీ ఈ దృశ్యం ఎంతగానో ఆకట్టుకుంది. అక్కడ వాతావరణం ఒక్కసారిగా ఎమోషనల్‌గా మారిపోయింది. ఈ నేపథ్యంలో రోహత్ తల్లి మాట్లాడారు.
'ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను అనుకోలేదు. వరల్డ్‌కప్‌కు వెళ్లే ముందు రోహిత్ నన్ను కలవానికి వచ్చాడు. ఈ ప్రపంచకప్ తర్వాత టీ20ల నుంచి తప్పుకుంటానన్నాడు. దీంతో ఎలాగైనా ఇది గెలవాలని అన్నాను. ఈరోజు నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఇలాంటి వాతావరణాన్ని ఎప్పుడూ చూడలేదు. తన సక్సెస్‌కు కారణం అతడి హార్డ్‌వర్క్, డెడికేషన్. వాటి వల్లే రోహిత్‌కు ఇంత ఆదరణ వస్తోంది. ఒక తల్లిగా నేను గర్విస్తున్నా. నా లైఫ్‌లో ఇలాంటి రోజు మళ్లీ రాదు. ఇవి భావోద్వేగ క్షణాలు. నేను కాస్త అనారోగ్యంగా ఉన్నాను. ఇవాళ నాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. అయినప్పటికీ ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ఇక్కడికి వచ్చాను' అని హిట్‌మ్యాన్ తల్లి పేర్కొన్నారు.