Rohit Sharma IPL 2025 Retention : ఐపీఎల్లో ఆయా ఫ్రాంచైజీలు విడుదల చేసిన రిటెన్షన్ ప్లేయర్ల లిస్ట్ ఇప్పుడు క్రీడాభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా ముంబయి ఇండియన్స్ చేసిన రిటెన్షన్ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. తమ పర్స్ వ్యాల్యూలోని రూ.75 కోట్లు వెచ్చించి మరీ టాప్ ప్లేయర్లను సొంతం చేసుకుంది. అయితే జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా కంటే రోహిత్ శర్మను తక్కువ ధరకు రిటైన్ చేసుకోవడం పట్ల అభిమానులు ఒకింత నిరాశ వ్యక్తం చేశారు. కానీ ఈ విషయంపై రోహిత్ తాజాగా మాట్లాడాడు. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన తనకి ఈ ధర సరైనదే అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
''రిటైర్మెంట్ అనౌన్స్ చేసిన తర్వాత ఈ పొజిషన్ నాకు సరైనదేనని భావిస్తున్నాను. జాతీయ జట్టుకు అత్యున్నత స్థాయిలో ప్రాతినిథ్యం వహిస్తున్న ప్లేయర్లకు ప్రాధాన్యతనివ్వాలని నేను నమ్ముతున్నాను. ఈ రిటెన్షన్ విషయంలో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. గత రెండు మూడు సీజన్లలో మేము అత్యుత్తమంగా ఆడలేకపోయాం. అయితే ఆ పరిస్థితిని మార్చేయాలన్న నిశ్చయంతో ఈ సారి బరిలోకి దిగనున్నాం . ఐపీఎల్ 20225 కోసం మేము ఎంతగానో ఎదురుచూస్తున్నాం. ముంబయి ఇండియన్స్‌కు ట్రోఫీలు గెలిచిన గొప్ప చరిత్ర ఉంది. నమ్మశక్యం కాని పరిస్థితుల నుంచి మ్యాచ్‌లు గెలిచిన సందర్భాలూ ఉన్నాయి.'' అని రోహిత్ వ్యాఖ్యానించాడు.
ముంబయి రిటెన్షన్ ప్లేయర్ల వాల్యూ ఇదే :
ముంబయి ఇండియన్స్ మాజీ సారథి రోహిత్ శర్మను రూ.16.30కోట్లకు జట్టు అట్టిపెట్టుకుంది. జస్ప్రీత్ బుమ్రాను రూ.18కోట్లకు, సూర్యకుమార్ యాదవ్‌ను రూ.16.35కోట్లు, పాండ్యను రూ.16.35కోట్లకు, అలాగే యంగ్ ప్లేయర్ తిలక్ వర్మను రూ.8 కోట్లకు రిటైన్ చేసుకుంది. మొత్తంగా రిటెన్షన్ కోసం రూ.75 కోట్లు వెచ్చించగా, మిగతా రూ.45 కోట్లతో మెగా వేలానికి దిగనుంది.