Rohit Sharma IND VS NZ Test Series : సుమారు 12 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై భారత్‌కు ఘోర పరాభవం ఎదురైంది. పుణె వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ రోహిత్ సేన ఓటమిని చవి చూసింది. తొలి టెస్టు ఓటమిని ఎదుర్కొని ఈ సారైనా గెలుస్తుందనుకుంటే సీన్ రివర్స్ అయ్యింది. ముఖ్యంగా ఈ సిరీస్‌లో టీమ్‌ఇండియా బ్యాటింగ్ విభాగం మరోసారి దారుణంగా విఫలమైంది. మరోవైపు న్యూజిలాండ్ స్పిన్నర్లు విజృంభించిన పిచ్‌పై భారత బౌలర్లు అనుకున్నంత పెర్ఫార్మ్ చేయలేకపోయారు. ఇప్పటికే ఈ ఓటమిపై స్పందించిన రోహిత్ శర్మ, సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపైనా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు. పరాజయాన్ని మరీ అంతగా పోస్టుమార్టం చేయాల్సిన అవసరం లేదంటూ ట్రోలర్స్‌ను చురకలు అంటించాడు.
"తొలి ఇన్నింగ్స్‌లో మేం సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు. అయితే పిచ్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. వారి ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరుకు మేము దగ్గరగా రాలేకపోయాం. కానీ మ్యాచ్ ముందుకు సాగే కొద్దీ పిచ్‌లో చాలా మార్పులు వచ్చాయి. గిల్ - యశస్వి పార్ట్నర్షిప్ సమయంలో మెరుగైన పరిస్థితిలోనే మేము ఉన్నాం. కానీ, ఆ తర్వాత వరుసగా వికెట్లను కోల్పోయి ఇబ్బంది పడ్డాం కూడా. అయితే ఆ ఒత్తిడిని తట్టుకోవడంలో విఫలమయ్యమనేది కాదనలేని వాస్తవం. గత రెండు టెస్టుల్లోనూ మేం అనుకున్నంతగా ఆడలేకపోయాం. అంతకుముందు వరుసగా 18 సిరీస్‌లను స్వదేశంలో గెలుపొందాం. ఎన్నో సవాళ్లను విసిరిన పిచ్‌లపైన కూడా మేము మా సత్తా చాటాం. చాలా విజయాలు సాధించినప్పటికీ, కొన్నిసార్లు ప్రణాళికలను సరిగ్గా అమలు చేయకపోతే ఓటములు తప్పవు. ఇక్కడ ఎవరి సామర్థంపై మేము సందేహం వ్యక్తం చేయడం లేదు. మరి ఎక్కువగా పోస్టుమార్టం చేయదల్చుకోలేదు. బ్యాటర్లు తమ ప్రణాళికలపై నమ్మకం ఉంచాల్సిన అవరసం ఎంతో ఉంది. న్యూజిలాండ్ ప్లేయర్లు కూడా అదే చేశారు.