Robin Uthappa About Virat Kohli : విరాట్ కోహ్లీ కారణంగానే యువరాజ్ సింగ్ కెరీర్ నాశనమైందంటూ టీమ్ఇండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప కీలక వ్యాఖ్యలు చేశాడు. యువరాజ్ సింగ్ కెరీర్‌పై సారథిగా విరాట్ వ్యవహరించిన తీరును ఆయన తాజాగా వివరించాడు. క్యాన్సర్‌ను జయించి 2017లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి కమ్‌బ్యాక్ ఇచ్చిన సమయంలో యూవీకి కోహ్లీ సపోర్ట్ చేయలేదని గుర్తు చేసుకున్నాడు.
"కోహ్లీ కెప్టెన్సీ స్టైల్ మిగతా వారికంటే డిఫరెంట్‌గా ఉంటుంది. అందరూ తన ప్రమాణాలను చేరుకోవాలని ఆశిస్తుంటాడు. అది క్రికెటైనా, ఫిట్‌నెస్, ఏదైనా సరే అవే స్టాండర్డ్స్ పాటించాలని కోరుకుంటాడు. కెప్టెన్స్‌లో రెండు రకాలు ఉంటారు. ఈ ప్రమాణాలు అవసరమని బలంగా చెప్పే టైప్ ఒకరైతే, తనకు కావాల్సినవి ఏంటో చూసి వాటిని బయటకు తెచ్చే వారు మరొకరు. ఈ ఇద్దరూ తమకు తగ్గట్లుగా ఫలితాలను సాధిస్తారు. అయితే, పర్సనల్‌గానూ వీటి ఎఫెక్ట్ వేరుగానే ఉంటుంది. ఒకరికి అత్యంత విలువ దక్కితే, మరొకరిని మాత్రం అందరూ పక్కన పెట్టేస్తారు.
కెప్టెన్సీని కూడా ప్రమాణాలకు తగ్గట్టుగా ఉండాలని కోరుకొనే రకం విరాట్. ఇందుకు యువరాజ్ కెరీర్ ఉదాహరణ. టీమ్ఇండియాకు రెండు వరల్డ్ కప్‌లు అందించిన యూవీ క్యాన్సర్‌ను జయించి అంతర్జాతీయ క్రికెట్‌లోకి 2017లో కమ్‌బ్యాక్ ఇచ్చాడు. అయితే అప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నాడు. యువీ ఫిట్‌నెస్ కూడా బాగానే ఉంది. అయితే కోహ్లీ మాత్రం తన ప్రమాణాలకు తగ్గట్టుగా మారాలంటూ యువరాజ్‌పై ప్రెజర్ పెట్టేవాడు. వీటి గురించి నాకు ఎవరూ ప్రత్యేకంగా చెప్పలేదు. నేను గమనించిన అంశాలను మాత్రమే ఇప్పుడు పంచుకుంటున్నాను. యువీ లంగ్ కెపాసిటీ తక్కువగా ఉంటుంది. అటువంటప్పుడు ఫిట్‌నెస్ స్థాయిని తెలిపే పాయింట్స్‌లో (పాయింట్లు) మార్పులు చేయాలి. అప్పుడే ఆ పాయింట్లలో రెండింటిని తగ్గించాలంటూ యువీ రిక్వెస్ట్ చేసినా కూడా అందుకు ఒప్పుకోలేదు. ఆ టెస్టును యువరాజ్ కంప్లీట్ చేశాడు. లేకపోతే జట్టులోకి తీసుకోరనేది యువీ ఆందోళన. టెస్టులో పాసై టీమ్‌లోకి వచ్చాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో సరిగ్గా ఆడలేకపోయాడు. ఇక ఆ తర్వాతనే రిటైర్మెంట్ అనౌన్స్ చేసేందుకు రెడీ అయిపోయాడు" అని ఉతప్ప కామెంట్ చేశాడు.