Rishabh Pant Accident :టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదం తర్వాత రీఎంట్రీలో అదరగొడుతున్నాడు. పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో నితీశ్ రెడ్డితో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు 37 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ నేపథ్యంలో ఓ స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టర్ అతడి యాక్సిడెంట్, రీ ఎంట్రీపై స్పెషల్ వీడియో చేసింది. అయితే ఇందులో ఓ ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది.
2022 డిసెంబర్లో రోడ్డు ప్రమాదం బారిన పడ్డ రిషభ్‌ను ఇద్దరు యువకులు రజత్ కుమార్, నిశు కుమార్ హాస్పిటల్‌కు తరలించారు. ఆ యాక్సిడెంట్ పట్ల మొదట స్పందించింది ఈ ఇద్దరు యువకులే. అటుగా వెళ్తున్న వాళ్లిద్దరూ యాక్సిడెంట్ పట్ల వెంటనే స్పందించి అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో పంత్‌కు సరైన సమయానికి ట్రీట్మెంట్ ప్రారంభమైంది. దీంతో పలు సర్జరీల తర్వాత పంత్ పూర్తిగా కోలుకున్నాడు. దీనిపై అప్పట్లో పంత్ కూడా స్పందించాడు. ఆ యువకులిద్దరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు.
తన ప్రాణాలు కాపాడడంలో కీలక పాత్ర పోషించిన యువకులిద్దరికీ పంత్ ఒక్కో స్కూటీ గిఫ్ట్‌గా ఇచ్చాడు. తాజా వీడియోలో ఆ యువకులు ఇద్దరు పంత్ గిఫ్ట్‌గా ఇచ్చిన స్కూటీలు నడుపుతూ కనిపించారు. ఆ వాహనాలపై 'రిషభ్ పంత్' అని రేడియంతో రాసి ఉంది. అయితే ఈ విషయం ఎవరికీ తెలియదు. పంత్ కూడా తాను స్కూటీలు బహుమతిగా ఇచ్చినట్లు ఎక్కడా చెప్పుకోలేదు. దీంతో నెటిజన్లు పంత్‌ను ప్రశంసిస్తున్నారు. స్కూటీలతో పాటు ఇంకా ఏమి ఇచ్చి ఉంటాడని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.