Ricky Ponting T20 World Cup 2024 :2013లో ఎంఎస్ ధోనీ నేతృత్వంలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత ఒక్క ఐసీసీ టైటిల్ కూడా దక్కించుకోలేకపోయింది టీమ్ఇండియా. ప్రతిసారి టైటిల్‌కు చేరుకునే క్రమంలో నిరాశ ఎదుర్కొంటూనే ఉంది. అయితే టీమ్ఇండియా ఐసీసీ ట్రోఫీల్లో విజయం దక్కించుకోలేకపోవడంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ తాజాగా స్పందించారు. ఐసీసీ టైటిల్ గెలవాలంటే ఎలా ఆడాలో సూచనలిచ్చారు.
"సుదీర్ఘంగా ఆలోచించి ఒత్తిడి పెంచుకోవడం కంటే, క్లియర్ మైండ్‌తో బరిలోకి దిగి ప్రయత్నించాలి. మిగతా విషయాలను పక్కకుపెడితేనే టీమిండియా గెలవగలదు. ఇండియా జట్టులో టాలెంట్‌కు కొదవలేదు. కానీ, అదే సమయంలో వరల్డ్ కప్‌లు గెలవడం అంత ఈజీ కాదని గుర్తుంచుకోవాలి. ప్రపంచంలోని బెస్ట్ ప్లేయర్లు అంతా వరల్డ్ కప్ కోసం పోటీపడుతుంటారు. వాళ్లంతా డిఫరెంట్ మైండ్ సెట్‌తో ప్రెజర్‌ను డీల్ చేస్తుంటారు. అలాగే మనం కూడా సిద్ధం కావాలి. ఆ పరిస్థితులే టీ20గేమ్ గెలవాలా, ఓడాలా అనే దాన్ని డిసైడ్ చేస్తాయి" అని పాంటింగ్ పేర్కొన్నాడు.
అలా మన మైండ్ సెట్‌ను ముందుగా సిద్ధం చేసుకుని మైదానంలోకి అడుగుపెట్టాలని పాంటింగ్ చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ ఒత్తిడి మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూశామని, దానిని డీల్ చేయడం చాలా కీలకమని అభిప్రాయపడ్డారు.