Ricky Ponting Delhi Capitals:దిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ 2025 ఐపీఎల్ మెగా వేలానికి ముందు సంచలన నిర్ణయం తీసుకుంది. జట్టు హెడ్‌కోచ్ రికీ పాంటింగ్‌ను ఆ బాధ్యతల నుంచి తొలగించింది. ఈ మేరకు శనివారం అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. '7 సీజన్ల తర్వాత దిల్లీ క్యాపిటల్స్ రికీ పాంటింగ్‌ను వదులుకుంటుంది. పాంటింగ్‌తో జర్నీ అద్భుతం. థాంక్యూ కోచ్' అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చింది. దీంతో దిల్లీతో పాంటింగ్ బంధం ముగిసినట్లైంది.
అయితే 2018లో రికీపాంటింగ్ దిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీతో చేరాడు. అప్పట్నుంచి దిల్లీకి హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన పాంటింగ్ 2024 ఐపీఎల్ దాకా ఆ పదవిలో కొనసాగాడు. ఈ 7సీజన్లలో దిల్లీని ఛాంపియన్‌గా నిలపడంలో పాంటింగ్ విఫలమయ్యాడు. కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి సీజన్లోనే జట్టు ఆఖరి స్థానంలో నిలవగా, 2019లో ప్లేఆఫ్స్, 2020లో ఫైనల్‌కు చేరింది. ఆ తర్వాత 2021లో ప్లేఆఫ్స్‌కు చేరిన దిల్లీ, 2022, 2023, 2024 సీజన్లలో టాప్-4లో నిలవలేకపోయింది.
కాగా, ప్రస్తుతం దిల్లీకి డైరెక్టర్‌గా ఉన్న సౌరభ్ గంగూలీ హెడ్ కోచ్ పదవి దక్కే ఛాన్స్ ఉంది. దీనికి గంగూలీ కూడా ఆసక్తి చూపిస్తున్నాడట. కొత్త కోచ్ గురించి త్వరలోనే ప్రకటన రావచ్చు. దీనిపై గంగూలీ కూడా స్పందించాడు. '2025 ఐపీఎల్ కోసం ప్లాన్ చేస్తున్నాను. ఈసారి దిల్లీ క్యాపిటల్స్ ఛాంపియన్‌గా నిలవాలని కోరుకుంటున్నా. భారత్‌కు చెందిన వారిని హెడ్ కోచ్‌గా నియమించాలని మేనేజ్‌మెంట్‌తో మాట్లాడతా. నేను హెడ్ కోచ్ అవ్వాలనుకుంటున్నాను. ఈసారి వేలంలో చురుగ్గా పాల్గొనాలి. కొత్త ప్లేయర్లను జట్టులోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది' అని గంగూలీ ఓ సందర్భంలో తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇక జట్టు అసిస్టెంట్ కోచ్‌గా మాత్రం ప్రవీణ్ ఆమ్రేనే కొనసాగే ఛాన్స్ ఉంది.