Pandya Brothers Mumbai Indians :టీమ్ఇండియా ఆటగాళ్లు పాండ్య బ్రదర్స్ కెరీర్ తొలినాళ్లలో తీవ్ర ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నారు. భోజనానికి డబ్బుల్లేక మూడేళ్లపాటు మ్యాగీ, న్యూడిల్స్తోనే కడుపు నింపుకున్నారు. ఆ తర్వాతి కాలంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబయి ఇండియన్స్ దృష్టిలో పడడం వల్ల వారి తలరాత మారిపోయింది. ఇదే విషయంపై రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.
'ఐపీఎల్‌లో ప్రతి ఫ్రాంచైజీకి ఫిక్స్డ్ బడ్జెట్ ఉంటుంది. అందుకే ప్రతి జట్టు అంతే మొత్తంలో ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి ఖర్చు చేయాలి. అందుకే ప్రతిభ ఉన్న ప్లేయర్ల కోసం వెతికాం. దేశవాళీ, రంజీ మ్యాచ్‌లను వీక్షించడం వల్ల నాణ్యమైన క్రికెటర్లను గుర్తించడం ఈజీగా ఉంటుందని మా టీమ్ అర్థం చేసుకుంది. ఒక రోజు ప్రతిభ ఉన్న ఇద్దరు అబ్బాయిలను ముంబయి ఇండియన్స్ శిబిరానికి తీసుకొచ్చారు. అప్పటికి వాళ్లిద్దరూ చాలా సన్నగా ఉన్నారు. వారే హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య'
'వారి దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల మూడు సంవత్సరాలపాటు మ్యాగీ, నూడుల్స్ తప్ప మరేమీ తినలేదని చెప్పారు. కానీ, వారిలో ఉన్నతస్థాయికి ఎదగాలనే స్ఫూర్తి, కసిని చూశాను.దీంతో 2015లో హార్దిక్ పాండ్యను ఐపీఎల్ వేలంలో రూ.10 వేల డాలర్లకు కొనుగోలు చేశాను. ప్రస్తుతం అతడు ముంబయి ఇండియన్స్‌కు గర్వకారణమైన కెప్టెన్' అని బోస్టన్ వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో నీతా అంబానీ తెలిపారు. అలా 10వేల డాలర్లకు జట్టులోకి వచ్చిన హార్దిక్‌ను ముంబయి ఈ సీజన్‌కు రూ.16.35 కోట్లకు అట్టిపెట్టుకుంది.