RCB vs LSG IPL 2024: 2024 ఐపీఎల్లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ రెండో విజయం నమోదు చేసింది. మంగళవారం చిన్నస్వామి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. 182 పరుగుల లక్ష్యా ఛేదనలో ఆర్సీబీ 153 పరుగులకే ఆలౌటైంది. మహిపాల్ లొమ్రోర్ (33 పరుగులు) రాణించగా, విరాట్ కోహ్లీ (22), రజత్ పాటిదార్ (29) ఫర్వాలేదనిపించారు. లఖ్‌నవూ బౌలర్లలో మయంక్ యాదవ్ 3, నవీనుల్ హక్ 2, మణిమరన్ సిద్ధార్థ్ , యశ్ ఠాకూర్, మార్కస్ స్టాయినిస్ తలో వికెట్ దక్కించుకున్నారు.
182 పరుగుల ఛేదనను ఆర్సీబీ ఘనంగానే ఆరంభించింది. తొలుత ఓపెనర్లు విరాట్ కోహ్లీ (22 పరుగులు), ఫాఫ్ డూప్లెసిస్ (19 పరుగులు) దూకుడుగానే ఆడారు. వీరి దెబ్బకు 4 ఓవర్లలో బెంగళూరు 40 పరుగులు సాధించింది. కానీ, 5వ ఓవర్లో అరంగేట్ర బౌలర్ సిద్ధార్థ్ చక్కని బంతితో విరాట్‌ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత ఓవర్లో డూప్లెసిస్ రనౌట్ అయ్యాడు.
ఆ వెంటనే స్టార్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (0)ను లఖ్‌నవూ స్పీడ్ గన్ మయంక్ యాదవ్ వెనక్కిపంపాడు. ఆ తర్వాత ఆర్సీబీ వరుసగా గ్లెన్ మ్యాక్స్‌వెల్ (0), కామెరూన్ గ్రీన్ (9) వికెట్లు కోల్పోయింది. దీంతో తొలి 9 ఓవర్లకే నాలుగు కీలక వికెట్లు పారేసుకున్న ఆర్సీబీ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో అనూజ్ రావత్ (11), రజత్ పాటిదార్ (29) ఆదుకునే ప్రయత్నం చేసినా, ఈ జోడీని స్టాయినిస్ విడగొట్టాడు. చివర్లో ఇంపాక్ట్ ప్లేయర్ మహిపాల్ లొమ్రోర్ మెరుపులు మెరిపించినా అది ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది. ఇక ఈ సీజన్లో ఇప్పటివరకూ నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ ఒకదాంట్లో నెగ్గి, మూడో పరాజయం మూటగట్టుకుంది.