RCB vs DC WPL 2024:2024 డబ్ల్యూపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జోరుకు బ్రేక్ పడింది. గురువారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ 25 పరుగుల తేడాతో నెగ్గింది. 195 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 169-9 స్కోర్‌కు పరిమితమైంది. కెప్టెన్ స్మృతి మంధాన (74 పరుగులు) భారీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. సబ్బినేని మేఘన (36), సోఫీ (23) మాత్రమే రాణించారు. దిల్లీ బౌలర్లలో జెస్ జొనాసెన్ 3, మరిజానే కాప్ 2, అరుంధతి రెడ్డి 2, శిఖ పాండే 1 వికెట్ దక్కించుకున్నారు.
భారీ లక్ష్య ఛేదనను ఆర్సీబీ ఘనంగా ఆరంభించింది. కెప్టెన్ స్మృతి ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడుతూ దిల్లీ బౌలర్లను బెంబేలెత్తించింది. ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడ్డ స్మృతి స్కోర్ బోర్డును పరులుగు పెట్టించింది. ఇక 8.3వ ఓవర్ వద్ద దిల్లి తొలి వికెట్ దక్కించుకుంది. ఓపెనర్ సోఫీ డివైన్ (23 పరుగులు) క్యాచౌట్‌గా పెవిలియన్ చేరింది.
సోఫీ ఔటైనా, స్మృతి ఎక్కడా తగ్గలేదు. జోరుగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. అర్ధ శతకం పూర్తైన తర్వాత కూడా స్మృతి జోరు కొనసాగింది. అయితే 74 వ్యక్తిగత పరుగుల వద్ద స్మృతి క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగింది. దీంతో వికెట్ల పతనం ప్రారంభమైంది. దిల్లీ పట్టు బిగించడం వల్ల ఆర్సీబీ వరుసగా వికెట్లు కోల్పోయింది.