R Ashwin England Series :ఇటీవలే టెస్టు క్రికెట్లో 500 వికెట్ల మైలురాయిని దాటిన టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులోనూ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్ జట్టుపై టెస్టుల్లో 100 వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్‌గా చరిత్రకెక్కాడు. రాంచీ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనతను అశ్విన్ సాధించాడు.
ఇంగ్లాండ్‌పై జరుగుతున్న తొలి ఇన్నింగ్స్ 21వ ఓవర్‌లో అశ్విన్ వేసిన రెండో బంతికి ఇంగ్లాండ్ ప్లేయర్ బెయిర్ స్టో ఔటయ్యాడు. దీంతో ఈ జట్టుపై టెస్టుల్లో 100 వికెట్ల మార్క్ (23 మ్యాచ్‌ల్లో) సాధించాడు. అంతేకాకుండా భారత్, ఇంగ్లాండ్ మధ్య టెస్టుల్లో 100 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గానూ అశ్విన్ రికార్డుకెక్కాడు. అయితే ఈ జాబితాలో అశ్విన్ కంటే ముందు ఇంగ్లాండ్ క్రికెటర్ జేమ్స్ అండర్సన్ టీమ్‌ఇండియాపై టెస్టుల్లో 139 వికెట్లు (35 మ్యాచ్‌ల్లో) తీసి టాప్ పొజిషన్లో ఉన్నాడు.
మరోవైపు టెస్టుల్లో ఒక దేశంపై వేయి పరుగులు + 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గానూ అశ్విన్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా క్రికెట్ హిస్టరీలో ఈ ఘనతను సాధించింన ఏడో బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. అయితే అతడి కంటే ముందు జార్జ్ గిఫెన్, మోనీ నోబెల్, విల్‌ఫ్రెడ్ రోడ్స్, గార్‌ఫీల్డ్ సోబెర్స్, ఇయాన్ బోథమ్, స్టువర్ట్ బ్రాడ్ ఈ రికార్డును చేజిక్కించుకున్నారు.