PV Sindhu About Marriage :భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తాజాగా తన పెళ్లి అలాగే కెరీర్ గురించి మాట్లాడింది.పారిస్ ఒలింపిక్స్ ముగియగానే వివాహం చేసుకుందామని భావించినట్లు తెలిపింది. వరుస టోర్నీలతో టైమ్ లేకుండా ఉండటం వల్ల పెళ్లి ఆలస్యమైందని తెలిపింది. హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్త సాయిను వివాహమాడనున్న సింధు తాజాగా ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో చెప్పిన పలు ముచ్చట్లు ఆమె మాటల్లోనే.
వారిద్దరి బ్లెస్సింగ్స్‌తోనే
లైఫ్‌లో ఓకొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. మా అమ్మ, నాన్న కష్టం వల్లనే నేను బ్యాడ్మింటన్‌లో ఈ పొజిషన్‌కు చేరుకున్నాను. ఇప్పుడు వాళ్లిద్దరి బ్లెస్సింగ్స్‌తోనే ఈ పెళ్లి చేసుకోనున్నాను. నా జీవితంలో ఎంతో అపురూపమైన సందర్భం ఇది. రెండు ఫ్యామిలీస్ మధ్య ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఒలింపిక్స్ అవ్వగానే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. కానీ తీరిక లేని షెడ్యూల్ వల్ల అది కుదరలేదు.
అయితే జనవరి నుంచి మళ్లీ టోర్నీలు ఉన్నాయి. దీంతో పెళ్లికి డిసెంబరు 22ను సరైన రోజుగా భావించాం. నెల రోజుల ముందే ఈ వివాహం నిశ్చయమైంది. ఇరు కుటుంబాల నుంచి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఉదయ్పుర్లో పెళ్లి వేడుకలు జరగనున్నాయి. అక్కడైతే కాస్త ప్రైవసీ ఉంటుంది. ఇక 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఉంటుంది. ఆ రోజు అందరినీ ఇన్వైట్ చేయాలని నిర్ణయించుకున్నాం.
నా మ్యాచ్‌లన్నీ చూస్తారు
వెంకట్ నాకు ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయనకు ఓ కంపెనీ ఉంది. దాన్ని నిర్వహణలో ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఇక నా షెడ్యూల్ కూడా తీరిక లేకుండానే ఉంటుంది. అందుకే మేమిద్దరం చాలా తక్కువ సార్లే కలిశాం. వెంకట్ బ్యాడ్మింటన్ ఆడరు. కానీ నా మ్యాచ్‌లన్నీ చూస్తారు. బ్యాడ్మింటన్‌ను ఫాలో అవుతారు. స్పోర్ట్స్ అంటే ఇష్టం. కానీ బిజినెస్ వైపు వెళ్లారు. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, డేటా సైన్స్ కోర్స్‌లను పూర్తి చేశారు. ప్రస్తుతం సొంత కంపెనీ పోసిడెక్స్ టెక్నాలజీస్‌కు ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
అదే నా లక్ష్యం
పెళ్లైన తర్వాత కూడా బ్యాడ్మింటన్ కంటిన్యూ చేస్తాను. గాయాలకు దూరంగా ఉంటూ ఫిట్నెస్ను కాపాడుకోవడమే నా మెయిన్ గోల్. పెళ్లి కుదిరిన తర్వాత కూడా నేను ఎప్పుడూ ప్రాక్టీస్ మానలేదు. మంగళవారం కూడా సాధన చేశాను. ఉదయ్‌పుర్‌కు వెళ్లే వరకూ ఈ ప్రాక్టీస్ ఇలాగే కొనసాగుతుంది. అయితే పెళ్లయ్యాక కొన్ని రోజులకు మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెడతాను.