PV Sindhu Syed Modi Badminton: సయ్యద్ మోదీ అంతర్జాతీయ సూపర్ 300 టోర్నీ సింగిల్స్‌లో భారత అగ్రశ్రేణి షట్లర్ పి.వి.సింధు ఛాంపియన్‌గా నిలిచింది. టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్‌లో వు లియో (చైనా)తో తలపడ్డ సింధు 21-14, 21-16 తేడాతో నెగ్గింది. తుదిపోరులో జోరు ప్రదర్శించిన సింధు వరుస సెట్లలో నెగ్గి టైటిల్ దక్కించుకుంది. అంతకుముందు సింధు సెమీస్‌లో భారత్‌కే చెందిన 17 ఏళ్ల ఉన్నతి హుడాపై విజయం సాధించింది. హుడాపై సింధు 21-12, 21-9తో తేడాతో నెగ్గింది.
కాగా, కెరీర్లో సయ్యద్ మోదీ టైటిల్ నెగ్గడం సింధుకు ఇది మూడోసారి. ఇదివరకు ఆమె 2017, 2022 టైటిల్ గెలుపొందింది. ఇక గత రెండేళ్లలో సింధుకు ఇది తొలి టైటిల్. ఆమె చివరిసారిగా 2022 సింగపుర్ ఓపెన్ టైటిల్ నెగ్గింది. ఆ తర్వాత 2023లో స్పెయిన్ మాస్టర్స్ 300, 2024లో మలేసియా మాస్టర్స్ 500 టోర్నీల్లో ఫైనల్‌కు చేరినప్పటికీ టైటిల్ పోరులో సింధు ఓడింది. ఈ టోర్నీ విజయంతో ఆమె ఉత్సాహం రెట్టింపు అయినట్లే!
వీళ్లూ గెలుపొందారు
- మరోవైపు పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ కూడా ఫైనల్‌లో గెలుపొందాడు. సింగపూర్‌కు చెందిన జియా హెంగ్ జేసన్ తేపై 21-6, 21-7తో విజయం సాధించాడు.
- మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్- ట్రీసా జాలీ జోడీ అదరగొట్టింది. ఫైనల్‌లో 21-18, 21-11 తేడాతో బావో లి జింగ్, లీ కియాన్ (చైనా) జోడీపై వరుస గేమ్‌ల విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. గాయత్రి- ట్రీసా జోడీకిది తొలి సూపర్ 300 టైటిల్ కావడం విశేషం. ఈ టోర్నీలో టైటిల్‌ను గెలిచిన తొలి భారత మహిళల డబుల్స్ జోడీగా రికార్డు సృష్టించింది. ఈ జోడీ 2022 ఎడిషన్‌లో రన్నరప్‌గా నిలిచింది.