Pujara Fastest Century Ranji Trophy:టీమ్ఇండియా సీనియర్ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారా 2024 రంజీలో అదరగొడుతున్నాడు. ఇప్పటికే ఒక డబుల్ సెంచరీ బాదిన పుజారా తాజాగా మరో శతకం నమోదు చేశాడు. అయితే టెస్టుల్లో నయావాల్‌గా పేరొందిన పుజారా ఈసారి మాత్రం తన శైలికి భిన్నంగా పరుగుల వరద పారించాడు. 100+ స్ట్రైక్ రేట్‌తో మూడంకెల స్కోర్ అందుకున్నాడు.
ఈ రంజీలో సౌరాష్ట్ర తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా శనివారం మణిపుర్ జట్టుపై రెచ్చిపోయాడు. కేవలం 105 బంతుల్లోనే 108 పరుగులు నమోదు చేసి తనలోని ఈ కోణాన్ని కూడా పరిచయం చేశాడు. 102.86 స్ట్రైక్ రేట్‌తో 12 ఫోర్లు, ఓ సిక్స్ బాదాడు. పుజారా సెంచరీతో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌ను 529/6 వద్ద డిక్లేర్డ్ చేసింది. పుజారాతో పాటు ప్రెరక్ మన్కడ్ (173 పరుగులు, 173 బంతులు), అర్పిత్ వాసవాడ (148 పరుగులు, 197 బంతులు) సెంచరీలు బాదారు. కాగా, ఫస్ట్ క్లాస్ కెరీర్లో పుజారాకు ఇది 63వ శతకం. ఈ ఫార్మాట్లో సునీల్ గావస్కర్ (81), సచిన్ తెందూల్కర్ (81), రాహుల్ ద్రవిడ్ (68) పుజారా కంటే ముందున్నారు.
ప్రస్తుత టోర్నమెంట్లో పుజారా ఇప్పటివరకు 6 మ్యాచ్‌ల్లో ఆడాడు. 74.78 సగటుతో 673 పరుగులు చేసి అత్యధిక పరుగుల జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇందులో 2 సెంచరీలున్నాయి. టీమ్ఇండియాలో స్థానం కోల్పోయిన పుజారా జాతీయ జట్టులో రీ ఎంట్రీ ఇచ్చేందుకు బాగానే కష్టపడుతున్నాడు. కాగా, చివరిసారిగా పుజారా 2023 డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు.