తెలంగాణ

telangana

'హాకీ కోచ్ నా టార్గెట్- దానికి స్ఫూర్తి రాహుల్ ద్రవిడే ' - PR Sreejesh Hockey

By ETV Bharat Sports Team

Published : Aug 14, 2024, 12:09 PM IST

PR Sreejesh Hockey: భారత హాకీ జట్టు దిగ్గజ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్‌ తన భవిష్యత్ ప్రణాళికను గురించి మాట్లాడాడు. ఆటకు టాటా చెప్పిన తరువాత రాహుల్ ద్రావిడ్​ను ఆదర్శంగా తీసుకొని కోచ్​గా ప్రయాణం ప్రారంభిస్తానన్నాడు.

PR Sreejesh Hockey
PR Sreejesh Hockey (Source: Associated Press)

PR Sreejesh Hockey:ది గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ ఇండియాగా పేరుగాంచిన టీమ్ఇండియా హాకీ గోల్‌కీపర్‌ పీఆర్‌ శ్రీజేష్‌ తన సుదీర్ఘ కెరీర్‌కు ఒలింపిక్స్‌తో వీడ్కోలు పలికాడు. ఒలింపిక్స్‌లో భారత్‌కు వరుసగా రెండోసారి కాంస్య పతకాన్ని అందించి తన కెరీర్‌కు గుడ్‌ బై చెప్పాడు. చివరి మ్యాచ్‌ అనంతరం శ్రీజేష్‌కు హాకీ ఆటగాళ్లు ఘనమైన వీడ్కోలు పలికారు. అయితే తన సుదీర్ఘ కెరీర్‌ను ముగించిన శ్రీజేష్‌ భవిష్యత్​లో ఏం చేయబోతున్నాడు? అన్నదానికి సమాధానం దొరికింది. శ్రీజేష్‌ టీమ్ఇండియా హాకీ జట్టు కోచ్‌గా మారాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. భారత క్రికెట్ జట్టు దిగ్గజ ఆటగాడు రాహుల్‌ ద్రవిడ్‌ కోచ్‌గా మారినట్లే, హాకీ దిగ్గజ ఆటగాడు శ్రీజేష్‌ కూడా భారత హాకీ జట్టు కోచ్‌గా మారాలని అనుకుంటున్నాడు.

టార్గెట్‌ కోచ్‌
భారత హాకీ జట్టు మాజీ గోల్‌కీపర్ శ్రీజేష్, క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ అడుగుజాడల్లో నడవాలని సంకల్పించుకున్నాడు. భారత హాకీకి కోచ్‌గా మారే లక్ష్యంపై దృష్టి సారించాడు. దశల వారీ ప్రణాళికతో తదుపరి తరం హాకీ స్టార్‌లను తయారు చేయాలని శ్రీజేష్‌ సంకల్పించుకున్నాడు. 2036 ఒలింపిక్స్‌లో ప్రధాన కోచ్‌గా భారత హాకీ జట్టును నడిపించాలని శ్రీజేష్‌ భావిస్తున్నాడు. టోక్యో, పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్ కాంస్య పతకాలు గెలవడంలో కీలక పాత్ర పోషించిన శ్రీజేష్ ఇప్పుడు ప్లేయర్ నుంచి కోచ్‌గా మారాలని చూస్తున్నాడు.

ఈ క్రమంలో భారత క్రికెట్ జట్టుకు హెడ్‌ కోచ్‌గా సాగిన ద్రావిడ్‌ ప్రయాణం నుంచి ప్రేరణ పొందినట్లు శ్రీజేష్ హాకీలో కూడా అదే మార్గాన్ని అనుసరించాలని చూస్తున్నాడు. 'నాకు కోచ్‌ కావాలనే లక్ష్యం ఎప్పటినుంచో ఉంది. రిటైర్‌మెంట్‌ తర్వాత ఇప్పుడు కుటుంబానికే నా తొలి ప్రాధాన్యం. వారితో చర్చించిన తర్వాతే భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాను. ముందు నేను నా భార్య మాట వినాలి' అని శ్రీజేష్ అన్నాడు.

జూనియర్‌ నుంచి సీనియర్‌
అత్యున్నత స్థాయిలో పోటీపడే సామర్థ్యం గల బలమైన జట్టును తయారు చేయాలని శ్రీజేష్ భావిస్తున్నాడు. 'నేను జూనియర్‌ జట్టుతో నా కోచ్‌ ప్రయాణాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాను. నాకు రాహుల్ ద్రవిడే మంచి ఉదాహరణ. ద్రవిడ్ కూడా జూనియర్‌ టీమ్‌ను తయారుచేసి వారిలో కొంతమందిని సీనియర్‌ జట్టులోకి తీసుకుని అద్భుతాలు చేశారు. నేను అలానే చేయాలని అనుకుంటున్నా' అని శ్రీజేష్‌ అన్నాడు. 2025లో జూనియర్ హాకీ జట్టుతో శ్రీజేష్‌ కోచింగ్‌ ప్రయాణాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.

'నేను ఈ సంవత్సరమే కోచింగ్‌ ప్రారంభించాలని అనుకుంటున్నా ను. 2025లో జూనియర్ ప్రపంచ కప్ ఉంది. మరో రెండేళ్లలో సీనియర్ జట్టు ప్రపంచ కప్‌లో ఆడుతుంది. 2028 నాటికి నేను 20 లేదా 40 మంది ఆటగాళ్లను తయారు చేయాలని భావిస్తున్నాను. 2032 నాటికి దాదాపు 30- 35 మంది ఆటగాళ్లు భారత జట్టులో ఉంటారు. 2036 ఒలింపిక్ క్రీడలకు భారత్‌ ఆతిథ్యం ఇస్తే, నేను చీఫ్ కోచ్ పదవికి సిద్ధంగా ఉంటాను' అని శ్రీజేష్‌ అన్నాడు.

దిల్లీలో హాకీ టీమ్​కు గ్రాండ్ వెల్​కమ్- రోడ్డుపై స్టెప్పులేసిన ప్లేయర్లు! - Paris Olympics 2024

వరుసగా 6 గోల్డ్​ మెడల్స్​ - ఒలింపిక్స్ చరిత్రలో భారత హాకీ జట్టు సాధించిన ఘనతలు ఇవే - Paris Olympics 2024

ABOUT THE AUTHOR

...view details