PM Modi On Olympics 2036 :ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడం భారత్ కల అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని మోదీ గురువారం పేర్కొన్నారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దిల్లీ ఎర్ర కోట వద్ద జెండా ఎగురవేసిన మోదీ అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్ నిర్వహణపై మరోసారి మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రీడా సంబరానికి ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన వెల్లడించారు.
'ఒలింపిక్స్‌లో భారత పతాకాన్ని రెపరెపలాడించిన యంగ్ అథ్లెట్లు మనతోనే ఉన్నారు. 140 కోట్ల మంది తరఫున వారందరికీ నేను కంగ్రాట్స్ చెబుతున్నా. మరికొన్ని రోజుల్లో పారా ఒలింపిక్స్‌లో పోటీ పడేందుకు అథ్లెట్లు వెళ్లనున్నారు. వారికి ఆల్ ది బెస్ట్. మనం G- 20 సమ్మిట్‌ను దిగ్విజయంగా నిర్వహించాం. ఈ సమ్మిట్‌తో భారీ ఈవెంట్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించగలమని నిరూపించాం. ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడం భారత్ కల. 2036లో నిర్వహించేందుకు మేమంతా సిద్ధమవుతున్నాం' అని మోదీ అన్నారు.
Paris Olympics 2024 India:పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో భారత అథ్లెట్లు మెరుదైన ప్రదర్శన కనబర్చారు. ఈ అంతర్జాతీయ పోటీల్లో భారత్ తరఫున 117 మంది అథ్లెట్లు ఆయా క్రీడాంశాల్లో బరిలో దిగి తమతమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. అయితే ఈసారి పతకాల సంఖ్య గతంలో (2020లో 7 పతకాలు) కంటే పెరుగుతుందని భావించగా, భారత్ ఆరింటితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇందులో ఐదు కాంస్యాలు, ఒక రజత పతకాలున్నాయి. పతకాల సంఖ్య అటుంచితే ఒలింపిక్స్‌లో మనోళ్లు పలు కొత్త రికార్డులు నెలకొల్పి చరిత్ర సృష్టించారు.