Rachin Ravindra Injury :న్యూజిలాండ్ యంగ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర మైదానంలో తీవ్రంగా గాయపడ్డాడు. ట్రై సిరీస్‌లో భాగంగా శనివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రచిన్ తలకు గాయమైంది. బౌండరీ లైన్ వద్ద క్యాచ్ కోసం ప్రయత్నించిన అతడు బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. దీంతో బంతి అతడి తలకు బలంగా తగిలి రక్త స్రావం జరిగింది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఫ్యాన్స్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై మండిపడుతున్నారు. ఎందుకంటే?
ఈ మ్యాచ్ పాకిస్థాన్ లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరిగింది. ఈ స్టేడియాన్ని ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇటీవల రెనొవేషన్ చేసి, రెండు రోజుల కిందటే పునఃప్రారంభించారు. అలా పునఃప్రారంభమైన తర్వాత స్టేడియంలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఇలా జరగడంతో పీసీబీపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నాసిరకం లైట్ల కారణంగానే రచిన్‌కు బంతి సరిగ్గా కనిపించలేదని అన్నారు. అంతేకాకుండా క్వాలిటీ లేని ఫ్లడ్లైట్లతో స్టేడియాలను ఆధునికీకరించారని ఆరోపిస్తున్నారు.
పాకిస్థాన్ స్టేడియాల రెనొవేషన్‌లో నాణ్యత లోపించిందని, దీని వల్ల యువ ఆటగాడు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశం కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని అంటున్నారు. పాకిస్థాన్ స్టేడియాల్లో ఇంటర్నేషనల్ మ్యాచ్‌లను నిర్వహించేందుకు ఐసీసీ ఎలా అనుమతించిందని కామెంట్లు పెడుతున్నారు. పీసీబీ పాకిస్థాన్ స్టేడియాల్లో ఫ్లడ్‌లైట్ల క్వాలిటీని పెంచాలని అడుగుతున్నారు. ఫ్లడ్‌లైట్ల నాణ్యత లోపం వల్లే రచిన్‌కు గాయమైందని, అతడు త్వరగా కోలుకోవాలని అతడు పోస్ట్ షేర్ చేశాడు. ప్లేయర్ల భద్రతను ఐసీసీ కట్టుబడి ఉండాలని మరో నెటిజన్ అన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.