PCB Chairman Resigns:పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ జాకా అష్రఫ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ఛైర్మన్ పదవికీ రాజీనామా చేశారు. శుక్రవారం జరిగిన బోర్డు మీటింగ్ తర్వాత అష్రఫ్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 2023 జూలై 6న పీసీబీ బోర్డు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అష్రఫ్, పదవీకాలం ఏడాది కూడా పూర్తి కాకుండానే రాజీనామా చేయడం గమనార్హం. పదవీకాలంలో తనకు మద్దతుగా నిలిచిన బోర్డు సభ్యులకు, ప్లేయర్లకు అష్రఫ్ ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్‌లో పాక్ క్రికెట్ జట్టు మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా, అష్రఫ్ రాజీనామాకు కొన్ని గంటల ముందు పాక్ క్రికెట్ బోర్డులో కీలక బాధ్యతల్లో ఉన్న మిక్కీ ఆర్ధర్, గ్రాంట్ బ్రాడ్‌బర్న్, ఆండ్రూ పుట్టిక్ కూడా పదవుల నుంచి తప్పుకున్నారు. అయితే 2023 వరల్డ్‌కప్ ఓటమి సహా, కొద్ది రోజులుగా పాకిస్థాన్ క్రికెట్ జట్టు వైఫల్యాలే ఈ మార్పులకు కారణం అని తెలుస్తోంది.
అన్నింట్లో ఫెయిల్:పాకిస్థాన్ కొత్త మేనేజ్మెంట్లో దాదాపు అన్ని సిరీస్, ఈవెంట్లలో ఘోరంగా విఫలమైంది. ఇక జాకా అఫ్రఫ్ బోర్డు ఛైర్మన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పాక్ రెండు మేజర్ (ఆసియా కప్, వన్డే వరల్డ్‌కప్) ఈవెంట్లలో పాల్గొంది. కాగా, పాకిస్థాన్ ఆసియా కప్ ఫైనల్స్ చేరడంలో, వరల్డ్‌కప్ సెమీస్ క్వాలిఫై అవ్వడంలో విఫలమైంది. దీంతో జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ కెప్టెన్సీని వదులుకున్నాడు. పాటు ఆస్ట్రేలియా పర్యటనలో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో పాక్ ఘోరంగా (3-0) ఓడింది. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరగుతున్న టీ20 సిరీస్‌లోనూ పాకిస్థాన్ విఫలమైంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాక్ ఇప్పటివరకు ఆడిన నాలుగింట్లోనూ ఓడింది. చివరి మ్యాచ్ జనవరి 21న జరగనుంది.