Paralympics 2024 Praveen Kumar Gold Medal : పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత అథ్లెట్లు తమ ప్రతిభను చాటుతూ అదరగొడుతున్న సంగతి తెలిసిందే. వైకల్యాలను అధిగమించి మరీ పతకాలను సాధిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. పురుషుల హై జంప్ టీ64 ఈవెంట్లో ప్రవీణ్ కుమార్ అగ్ర స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్‌ను దక్కించుకున్నాడు. టీ 64 హై జంప్ పోటీల్లో 2.08 మీటర్ల ఎత్తు జంప్ చేసి స్వర్ణాన్ని ముద్దాడాడు. ఈ సీజన్‌లో ఇదే అత్యుత్తమ హై జంప్ రికార్డ్. ఈ మెడల్‌తో భారత్ ఖాతాలో పతకాల సంఖ్య 26కు చేరింది. ఇందులో 6 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్య పతకాలు ఉన్నాయి.
అతిచిన్న వయసులోనే రికార్డ్ - 2021లో జరిగిన టోక్యో పారాలింపిక్స్‌లోనూ ప్రవీణ్ సిల్వర్ మెడల్ సాధించాడు. తద్వారా అప్పుడు అతడు అతి చిన్న వయసులోనే ఒలింపిక్ మెడల్ సాధించిన పారా అథ్లెట్‌గా చరిత్రకెక్కాడు. ఇంకా ప్రస్తుత పారాలింపిక్స్‌లో మెడల్ అందుకోవడంతో, ప్రవీణ్ పారాలింపిక్స్‌లో వరుసగా రెండో పతకాన్ని సాధించినట్టైంది.
అలానే హైజంప్‌లో భారత్ తరఫున గోల్డ్ మెడల్ సాధించిన రెండో ఆటగాడు కూడా ప్రవీణే. అంతకుముందు మరియప్పన్ తంగవేలు ఈ హైజంప్‌లో స్వర్ణాన్ని ముద్దాడాడు. ఇంకా పారిస్ పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన మూడో హైజంపర్‌గానూ నిలిచాడు. ఇకపోతే ఈ పారిస్ పారాలింపిక్స్‌లో ఇప్పటికే హైజంప్ టీ-63 ఈవెంట్లో శరద్ కుమార్ సిల్వర్(1.88 మీటర్లు), తంగవేలు మరియప్పన్ బ్రాంజ్(1.85 మీటర్లు) మెడల్‌ను దక్కించుకున్నారు.