Paris Paralympics 2024 Telugu States Para Athletes : టోక్యో ఒలింపిక్స్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది అథ్లెట్లు ఎన్నో అంచనాలతో బరిలో దిగి పతకాలు సాధించలేకపోయారు. అయితే ఇప్పుడు అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టి పతకం సాధించేందుకు తెలుగు పారా అథ్లెట్లు రెడీ అయ్యారు. ఈ నెల 28న పారిస్‌లో ప్రారంభమయ్యే పారాలింపిక్స్‌లో పోటీ పడనున్నారు. వైకల్యాన్ని దాటి పతక వేటకు సై అంటున్నారు. మరి వారెవరు, వారి స్ఫూర్తిదాయక ప్రస్థానం గురించి తెలుసుకుందాం.
మేధోపరమైన బలహీనత ఉన్నప్పటికీ : జీవాంజి దీప్తికి పుట్టుకతోనే మానసిక వైకల్యం. మరోవైపు పేదరికం. ఎన్నో అవమానాలు. కానీ తనకు వచ్చిన పరుగునే నమ్ముకుని ముందుకెళ్లింది. దీంతో ఇప్పుడామె ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. అలా పారిస్ పారాలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఈ క్రీడల్లో మహిళల టీ20 400 మీటర్ల విభాగంలో బరిలోకి దిగుతోంది.
వరంగల్ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన అమ్మాయి దీప్తి. ఆమె తల్లిదండ్రులు యాదగిరి, ధనలక్ష్మి కూలీ పనులు చేసుకుంటారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్న అర ఎకరం భూమి కూడా అమ్మేసుకున్నారు. అయితే మరోవైపు దీప్తి చిన్నప్పటి నుంచి వేగంగా పరుగెత్తెతు థ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ దృష్టిలో పడింది. దీంతో దీప్తిని హైదరాబాద్‌కు తీసుకొచ్చాడాయన. అలా అనంతరం ఆమె పోటీల్లో పాల్గొని మెడల్స్ సాధించడం ప్రారంభించింది.
గతేడాది ఆసియా పారా క్రీడల్లో రికార్డు ప్రదర్శన చేసి పసిడి గెలిచింది దీప్తి. అప్పుడు దక్కిన ప్రైజ్ మనీ రూ.30 లక్షలతో తల్లిదండ్రులకు మళ్లీ భూమి కొని ఇచ్చింది. ఇంకా ఈ ఏడాది ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లోనూ స్వర్ణాన్ని గెలుచుకుంది. అలానే ప్రపంచ రికార్డు ప్రదర్శనతో(55.07 సెకన్లు) పారిస్ పారాలింపిక్స్‌కు అర్హత సాధించింది.
కృతిమ కాలుతో - కొంగనపల్లి నారాయణది నంద్యాల జిల్లాలోని ప్యాపిలి. రాష్ట్ర స్థాయిలో కబడ్డీలో రాణించేవాడు. ఈ క్రమంలోనే 2007లో సైన్యంలో చేరాడు. అయితే జమ్మూలో విధులు నిర్వర్తిస్తుండగా మందుపాతర పేలి అతడి ఎడమ కాలు తీవ్రంగా గాయపడింది. దీంతో వైద్యులు దాన్ని తీసేశారు.