Paris Olympics 2024 Sarabjot : పారిస్ ఒలింపిక్స్ లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ మిక్స్డ్ ఈవెంట్లో సరబ్ జోత్, మను బాకర్‌తో కలిసి కాంస్య పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. సౌత్ కొరియాకు చెందిన లీ వొన్‌హో, ఓ హైజిన్ జోడీని 16-10 పాయింట్ల తేడాతో ఓడించి ఈ మెడల్‌ను ముద్దాడారు. ఈ విజయంతో భారత్‌కు కాంస్య పతకం దక్కింది. దీంతో వీరిద్దరిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
అయితే కాంస్య పతకం సాధించిన సరబ్ జోత్ సింగ్ అనంతరం ఇండియా హౌస్‌కు వెళ్లాడు. అక్కడ ఆయనకు నీతా అంబానీ, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఏమి కావాలని సరబ్‌ను అడిగారు. దీనికి అతడు 'దయచేసి నాకు తినడానికి ఏదైనా ఇవ్వండి' అంటూ చమత్కరించాడు. అనంతరం వారు అందించిన తినుబండారాలను సరబ్ జోత్ సింగ్ ఆరగించాడు. పానీ పూరీ, భేల్ పూరీ, దోసెలు సహా ప్రసిద్ధ భారతీయ వంటకాల రుచి చూశాడు సరబ్.
సరబ్‌కు ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం - మరోవైపు, పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం ముద్దాడి స్వదేశానికి చేరుకున్న సరబ్ జోత్ సింగ్‌కు దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. అభిమానులు సరబ్, సరబ్ అంటూ కేరింతలు కొడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.