Paris Olympics 2024 Neeraj Chopra Modi : బల్లెం వీరుడు, భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్ 2024లో అదరగొట్టాడు. గోల్డ్ మెడల్ సాధిస్తాడని ఆశిస్తే రజత పతకం అందుకున్నాడు. అయినా దీన్ని తక్కువగా అనలేం. ఎందుకుంటే అది అత్యుత్తమ ప్రదర్శన. గురువారం అర్ధరాత్రి జరిగిన జావెలిన్ త్రో ఫైనల్‌లో తన రెండో ప్రయత్నంలో ఈటెను 89.45 మీటర్లు విసిరి మరీ ఈ మెడల్‌ను దక్కించుకున్నాడు. మొత్తం 12 మంది ఈ తుది పోరులో పోటీ పడ్డారు. వీరిలో నీరజ్ రెండో స్థానంలో నిలిచాడు. దీంతో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు అభినందనలు తెలుపుతున్నారు. కాగా, ఈ తుది పోరులో పాక్ అథ్లెట్ నదీమ్ అర్షద్ 92.97 మీటర్లు ఈటెను విసిరి గోల్డ్ మెడల్‌ను దక్కించుకున్నాడు. గ్రెనడా అథ్లెట్ పీటర్స్ అండర్సన్ 88.54 మీటర్లు ఈటె విసిరి కాంస్యం దక్కించుకున్నాడు.
గర్వపడేలా చేశావు - అయితే వరుస ఒలింపిక్స్‌లో నీరజ్ రెండు పతకాలు అందుకోవడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఎక్స్‌లో పోస్టు చేస్తూ నీరజ్‌ను కొనియాడారు. "నీరజ్ చోప్రా నువ్వు అద్భతమైన వ్యక్తివి. ఇతడు తన ప్రతిభను మళ్లీ నిరూపించాడు. అతడు మరో ఒలింపిక్ మెడల్ సాధించి భారత్‌ను గర్వించేలా చేశాడు. సిల్వర్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రాకు అభినందనలు. భవిష్యత్‌లో రాబోయే అథ్లెట్లు తమ కలలను నెరవేర్చు కోవడానికి, అలానే భారత్‌ను గర్వపడేలా చేయడానికి నీరజ్ స్ఫూర్తి కొనసాగుతూనే ఉంటుంది" అని మోదీ ప్రశంసలు కురిపించడంతో పాటు హర్షం వ్యక్తం చేశారు.