Paris olympics 2024 NASA Astronauts:పారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభోత్సవ వేడుకలు ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ విశ్వ క్రీడల సంబరాన్ని చూసేందుకు దాదాపు 3,20,000 మందికి పైగా ప్రేక్షకులు హాజరై ఎంతో సందడి చేశారు. ఒలింపిక్ చరిత్రలోనే ఇంత మంది హాజరవ్వడం ఇదే తొలిసారి. వీరిలో రాజకీయ ప్రముఖులు, సినీ ప్రమఖులు, దేశాధినేతలు, వేలాది మంది ప్రదర్శనకారులు కూడా ఉన్నారు.
Paris olympics 2024 Live Updates :అయితే ఈ విశ్వక్రీడల సంబరం ఏకంగా భూమి ఆకర్షణ శక్తిని దాటి అంతరిక్షానికి కూడా చేరిపోయింది. పారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్‌ఎస్‌లో వ్యోమగాములు మినీ ఒలింపిక్స్‌ను నిర్వహించారు. భారత సంతతి అమెరికన్ ఆస్ట్రోనాట్ సునితా విలియమ్స్‌తో పాటు మరో ఐదుగురు వ్యోమగాములు మైక్ బారట్, జీనెట్ ఎప్స్,బుచ్ విల్మోర్, ట్రేసీ కాల్డ్‌వెల్ డైసన్ పాల్గొన్నారు. దీనికి సంబంధించి 2 నిమిషాల నిడివి ఉన్న వీడియోను నాసా సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ వీడియోలో వ్యోమగాములు ఎంతో ఉత్సాహంగా కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ వీడియోలో వ్యోమగాములు ఒక ఒలింపిక్ టార్చ్‌ను ఒకరినొకరు పాస్ చేసుకుంటూ కనిపించారు. అలానే క్రీడలను ఆడారు. రన్నింగ్, జిమ్నాస్టిక్, వెయిట్ లిఫ్టింగ్, షాట్ పుట్ వంటి క్రీడలను ఆడుతూ వీరంతా ఎంజాయ్ చేశారు. మీరు కూడా ఈ వీడియోను చూసేయండి.