Paris Olympics 2024 Manu Bhaker : పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ షూటర్ మను బాకర్‌కు త్రుటిలో మూడో పతకం మిస్ అయ్యింది. తాజాగా శనివారం జరిగిన 25మీటర్ల పిస్టల్ ఈవెంట్లో మను 28 పాయింట్లతో నాలుగో స్థానానికి పరిమితమైంది. ఈ ఈవెంట్లో దక్షిణ కొరియా షూటర్ యాంగ్ జీన్ గోల్డ్ మెడల్ సాధించింది.
అయితే ఈ పారిస్ ఒలింపిక్స్‌లో రెండు వేర్వేరు షూటింగ్ ఈవెంట్‌లలో మను భాకర్ ఇప్పటికే రెండు కాంస్య పతకాలను ముద్దాడిన సంగతి తెలిసిందే. మూడో పతకం కోసం ఇవాళ పోటీపడగా అది నెరవేరలేదు. అయినా కూడా స్వాత్రంత్య్రం తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచింది.
ఇక తాజా ఈవెంట్ ముగిశాక ఫలితం గురించి మను మాట్లాడింది. "రెండు కాంస్య పతతాలు సాధించడం సంతోషంగా ఉంది కానీ, చివరి ఈవెంట్లో నాలుగో స్థానానికి పరిమితమైనందుకు బాధగా ఉంది" అని పేర్కొంది. తన తదుపరి లక్ష్యం 2028లో జరగబోయే లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ అని పేర్కొంది.
"నేను బాగా ఒత్తిడికి గురయ్యాను. కానీ ఆ తర్వాత నా వంతుగా కామ్‌గా, పీస్‌గా ఉంటూ బెస్ట్ ఔట్‌ఫుట్ ఇవ్వడానికి ట్రై చేశాను. కానీ అది సరిపోలేదు. ఈ ఒలింపిక్స్ నాకు ఎంతో మంచి అనుభవంగా మారింది. అయితే ఎప్పుడూ మరో ఒలింపిక్స్ ఉంటుంది కాబట్టి ఇక దాని కోసం ఎదురుచూస్తున్నాను. ప్రస్తుతం రెండో మెడల్స్ రావడం ఎంతో ఆనందంగా ఉంది కానీ ప్రస్తుతం ఈ విభాగంలో కోల్పోవడం కాస్త బాధగానే ఉంది. నాలుగో స్థానంతో సరిపెట్టుకోవడం నాకు నచ్చలేదు. అని చెప్పింది.
మను ఈ ఒలింపిక్స్‌లో ఇప్పటికే రెండు మెడల్స్‌ను సాధించడం వల్ల మూడో పతకం కచ్చితంగా సాధిస్తుందని అందరూ అంచనాలు పెంచేసుకున్నారు. అయితే దీనిపై స్పందించిన మను తన చుట్టూ ఉన్న భారీ అంచనాలు, ప్రచారాల వల్ల తన మనసు, మెదడు పరధ్యానం చెందలేదని, అన్నింటినీ పూర్తిగా స్విచ్ఛాఫ్ చేసి కేవలం తన లక్ష్యంపైనే గురిపెట్టినట్లు పేర్కొంది.