Paris Olympics 2024:పారిస్‌లో 2024 సమ్మర్ ఒలింపిక్స్ జులై 26న ప్రారంభం కానున్నాయి. నగరానికి 200కి పైగా దేశాల నుంచి అభిమానులు, క్రీడాకారులు వస్తారని అంచనా. అత్యంత ఖరీదైన ఒలింపిక్ క్రీడల్లో ఒక దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయనున్నారు. 2014లో సోచిలో జరిగిన వింటర్ గేమ్స్ అత్యంత ఖరీదైన ఒలింపిక్స్. దీనికి దాదాపు 25 బిలియన్ డాలర్లు వెచ్చించారు. టోక్యోలో సమ్మర్ ఒలింపిక్స్ వాస్తవానికి 2020లో జరగాల్సి ఉండగా, COVID-19 మహమ్మారి కారణంగా 2021లో నిర్వహించారు. ఇది రెండో అత్యంత ఖరీదైన ఒలింపిక్స్‌గా నిలిచింది. కొన్ని నివేదికల ప్రకారం, 2024 పారిస్ ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు అయ్యే ఖర్చు సుమారు 8.2 బిలియన్ డాలర్లు అని అంచనా వేశారు. అంటే ఇండియన్ కరెన్సీలో ఇది దాదాపు రూ.70వేల కోట్లు. ఇది సమ్మర్ లేదా వింటర్ అన్నింట్లో కలిపి ఆరో అత్యంత ఖరీదైన ఒలింపిక్స్ కానుంది.
దేనికి ఎంత ఖర్చు చేస్తున్నారు?
పారిస్ ఒలింపిక్స్ కోసం 8.2 బిలియన్ డాలర్లు అంచనాలో స్టేడియం పునర్నిర్మాణం, ప్రారంభ, ముగింపు వేడుకలు, ఆహార సేవలు, కార్మిక వేతనాలు, భద్రత వంటి నిర్వహణ ఖర్చులు ఉన్నాయి. వీటితో పాటు, హైవేలు, రైల్‌రోడ్‌లు, విమానాశ్రయాలు, హోటళ్లను అప్‌గ్రేడ్ చేయడం వంటి మౌలిక సదుపాయాల మెరుగుదలకు ఫ్రాన్స్ దాదాపు 3.2 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ఈ మౌలిక సదుపాయాల ఖర్చులు అధికారిక ఒలింపిక్ బడ్జెట్‌లో భాగం కావు.
పారిస్‌లో చివరిసారిగా ఒలింపిక్స్ ఎప్పుడు?
పారిస్ చివరిసారిగా 1924లో సమ్మర్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఒలింపిక్స్‌ను నిర్వహించడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇటీవల కాలంలో ఒలింపిక్స్‌కి ఆతిథ్యం ఇచ్చిన చాలా నగరాలు నష్టాలు ఎదుర్కొన్నాయి. ఉదాహరణకు, రియో డి జనీరోలో 2016 సమ్మర్ ఒలింపిక్స్‌కి ఆతిథ్యం ఇచ్చినప్పుడు బ్రెజిల్ సుమారు 2 బిలియన్ డాలర్లు కోల్పోయింది. టోక్యో సమ్మర్ ఒలింపిక్స్ ఖర్చులు పెరిగి దాదాపు 800 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది.
పారిస్ ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ సీఈవో ఎటియెన్ థోబోయిస్ మే నెలలో ఖర్చు గురించి విలేకరులతో మాట్లాడారు. 'ప్రతి ఒక్కరూ ఖర్చు చేసిన ప్రతి పైసా గురించి స్పృహ కలిగి ఉన్నారు. అది ఉపయోగకరంగా ఉంటుంది. మేము ఇప్పటికే అందుబాటులో ఉన్న విషయాలపై ఎటువంటి ఖర్చు చేయకుండా జాగ్రత్త వహించాలి. స్పష్టంగా చెప్పాలంటే, అది ఒక సవాలు' అని చెప్పారు.