Paris Olympics 2024 Closing Ceremony :అద్భుత విన్యాసాలు, వాటితో పాటు అంతులేని భావోద్వేగాలు ఇలా పలు అంశాల సమ్మేలనంగా సాగిన 19 రోజుల విశ్వ క్రీడా వినోదానికి గ్రాండ్‌గా తెరపడనుంది. సెన్ నది వేదికగా ఈ నెల 26న అధికారికంగా ప్రారంభమైన పారిస్ ఒలింపిక్స్, వివిధ పోటీల ద్వారా క్రీడాభిమానులను అలరించి నేటితో (ఆగస్టు 11) ముగియనుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 12.30 గంటలకు ఈ ఒలింపిక్స్ క్లోజింగ్ సెరిమనీ జరగనుంది. ఇక ఈ వేడుకల్లో భారత పతాకధారులుగా షూటర్ మను బాకర్, అలాగే హాకీ స్టార్ ప్లేయర్ శ్రీజేష్ వ్యవహరించనున్నారు.
ఇక ఈ ముగింపు వేడుకకు స్టేడ్ డి ఫ్రాన్స్ స్టేడియం వేదిక కానుంది. ఈ ప్రోగ్రామ్‌లో పాప్ సింగర్, రైటర్ హెచ్.ఈ.ఆర్ పెర్ఫామనెన్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది. వీటితో పాటు పలు డ్యాన్స్, మ్యూజిక్ ప్రోగ్రామ్స్ కూడా ప్రేక్షకులను అలరించనున్నాయి.
చివరి రోజు జరగనున్న పోటీలు :
ఒలింపిక్స్ చివరి రోజు బాస్కెట్‌బాల్, సైక్లింగ్ ట్రాక్, అథ్లెటిక్స్ (మహిళల మారథాన్), హ్యాండ్‌బాల్, మోడర్న్ పెంటథ్లాన్, వాలీబాల్, వాటర్ పోలో, రెజ్లింగ్,వెయిట్‌లిఫ్టింగ్‌లో పోటీలున్నాయి. అలా 14 పసిడి పతకాంశాలున్నాయి. బాస్కెట్‌బాల్ అమ్మాయిల ఫైనల్‌తో పోటీలు ముగుస్తాయి.