Pakistan T20 World Cup 2024:2024 టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ జర్నీ దాదాపు ముగిసింది. గ్రూప్- A నుంచి టాప్ 2లో ఉన్న భారత్, అమెరికా సూపర్- 8కు అర్హత సాధించాయి. టోర్నీలో ఇప్పటిదాకా 3 మ్యాచ్‌లు ఆడిన పాక్ రెండింట్లో ఓడి, ఒకటి మాత్రమే నెగ్గి మూడో స్థానంలో ఉంది. ఇక గ్రూప్ స్టేజ్‌లో మరో మ్యాచ్ ఆడాల్సి ఉన్నప్పటికీ పాక్‌కు అది నామమాత్రమే.
ఈ మ్యాచ్ ఫలితం ఏదైనా పాకిస్థాన్‌కు ఒరిగేదేమీ లేదు. అయితే గత సీజన్ (2022)లో ఫైనలిస్ట్ అయిన పాక్ ఈసారి గ్రూప్ స్టేజ్‌లోనే ఇంటబాట పట్టనుండడం సదరు క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా, ప్రతిష్ఠాత్మకమైన టీ20 టోర్నీ కోసం పాక్ జట్టు ఎంపిక సరిగ్గా లేదని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.
పీసీబీ ప్లాన్ రివర్స్!
ప్రస్తుత టోర్నీలో సూపర్- 8 మ్యాచ్‌లు వెస్టిండీస్‌లో జరగనున్నాయి. అయితే ఈ టోర్నీకి ముందు పాక్ ప్లేయర్లు ఆమిర్ ఖాన్, ఇమాద్ వసీమ్, అజామ్ ఖాన్ వెస్టిండీస్ పిచ్‌లపై కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడారు. దీంతో కీలకమైన సూపర్- 8 దశలో ఈ ప్లేయర్ల అనుభవం కలిసి వస్తుందన్న ఉద్దేశంతో సీపీఎల్ (CPL)లో ఆడిన వాళ్లను ఎంపిక చేసినట్లున్నారు. కానీ, ఈ ప్లాన్ బెడిసికొట్టినట్లైంది. సూపర్- 8 మాట అటుంచితే, గ్రూప్ స్టేజ్‌లోనే పాకిస్థాన్ పేలవ ప్రదర్శన కనబర్చింది. ఫలితంగా సూపర్- 8కు అర్హత సాధించకుండానే పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. దీంతో వెస్టిండీస్‌లో మ్యాచ్‌ల కోసం ప్లాన్ చేస్తే, అక్కడకు వెళ్లకుండానే అమెరికా నుంచి తిరిగి స్వదేశం పాకిస్థాన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.